ఓయూలో ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నా సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో ఇంటర్వ్యూల్లో రాణించలేకపోతున్నారు.
ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ దుస్థితికి తెరదించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇవ్వనున్నారు. అధ్యాపకులకే కాకుండా ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులకూ శిక్షణ ఇచ్చి, ఫ్యూచర్ టెక్నాలజీపై వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఫర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యూనివర్సిటీ పాలక మండలి ఇందుకు అవసరమైన ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇందులో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, భవిష్యత్తులో బిల్డింగ్ నిర్వహణ, ఇతర అబివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లు కార్పస్‌ఫండ్‌గా జమ చేయనున్నారు.

ఫ్యూచర్ టెక్నాలజీపై శిక్షణ :
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవలే వందేళ్ల ఉత్సవాలను పూర్తి చేసుకుంది. ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటివరకు పాతిక వేల మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో పదివేలకుపైగా వివిధ దేశాల్లో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ అలుమ్నీ అసోసియేషన్‌లో ఇప్పటికే ఆరువేల మందికిపైగా సభ్యత్వం పొంది ఉన్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ వీరంతా ఉస్మానియా క్యాంపస్‌ను సందర్శించారు. వర్సిటీలో అలుమ్నీ అసోసియేషన్ తరపున ఏదైనా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా లక్ష మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. వీరిలో ఉపాధి పొందుతుంది చాలా తక్కువే. విద్యార్థులు పారిశ్రామిక, భవిష్యత్తు సాంకేతిక అవసరాలపై ముందే శిక్షణ ఇస్తే.. ఇంటర్వ్యూల్లో సులభంగా రాణించగలుగుతారని భావించారు. ఇక్కడ కేవలం ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా తెలంగాణలోని ఇతర యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు.

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో...
ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 40 గదులతో పాటు నాలుగు సెమినార్ హాళ్లు, ఏడెనిమిది క్లాసు రూమ్‌లు నిర్మించనున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులు, పూర్వ విద్యార్థులు బస చేసేందుకు అవసరమైన గెస్ట్‌హౌస్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం అవసరమై కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు ఈ భవనానికి సమీపంలో ఉన్న మోయిని చెరువును అభివృద్ధి చేసి కబ్జారాయుళ్ల బారి నుంచి రక్షించనున్నారు.



#Tags