Engineering Seats: కారణాల్లేకుండా ఎలా తిరస్కరిస్తారు?: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపు, కోర్సుల విలీనం దరఖాస్తులను ఎలాంటి కారణాలు చూపకుండా ఎలా తిరస్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మళ్లీ దరఖాస్తులను పరిశీలించి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండకూడదని స్పష్టం చేసింది. కాలేజీ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడం జాప్యమైతే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లోనూ మార్పులు చేయొచ్చని వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలను కొట్టివేసింది. అలాగే దరఖాస్తులను తిరస్కరిస్తూ జూలై 26న ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.

దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కచ్చితమైన కారణాలను వెల్లడించాలని చెప్పింది. బీటెక్‌/బీఈలో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం సర్కార్‌దేనని తీర్పునిచ్చారు. 

చదవండి: Govt Schools: ఇన్‌స్ట్రక్టర్ల నియామకమెప్పుడో!

రీయింబర్స్‌మెంట్‌ సాకు సరికాదు..

సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ పలు కాలేజీలు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఆగ‌స్టు 13న‌ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌.శ్రీరామ్, శ్రీరఘురామ్, ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘జేఎన్‌టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తిరస్కరించడం సరికాదు.

అధ్యాపకులు, ఇతర వసతులు లాంటి అన్ని అంశాలను ఏఐసీటీఈ నిపుణుల తనిఖీ కమిటీ పరిశీలించింది. పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకు అనుమతి కోరుతున్నాం. దీంతో ఒక్క సీటు కూడా అదనంగా పెరగడం లేదు. ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎలాంటి కారణం చెప్పకుండానే అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరాకరించారు’ అని చెప్పారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. కాలేజీలు కోరిన విధంగా సీట్లు పెంచుకుంటూపోతే సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. సీట్ల పెంపు, విలీనంపై నిర్ణయం తీసుకునే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని కోర్సుల్లో ఇప్పటికీ చాలా ఖాళీ సీట్లు ఉన్నాయి. ఇంకా పెంచాలని కోరడం సరికాదు. అప్పీళ్లను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.  

చదవండి: Common Test For All Government Jobs : ఇక‌పై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేష‌న్‌ల‌లో..!

ధర్మాసనం పేర్కొన్న కీలక అంశాలు

‘అప్పీల్‌ చేసిన కాలేజీలకు తిరస్కరించి, మరికొన్ని కాలేజీలకు అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం. విద్యా చట్టంలోని సెక్షన్‌ 20ను పరిశీలించిన సింగిల్‌ జడ్జి.. దరఖాస్తుల తిరస్కరణ అధికారం ప్రభుత్వానికి ఉందని అభిప్రా యపడ్డారు. కొన్ని విద్యాసంస్థలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చినట్లయితే.. అదే తప్పును పునరావృతం చేయడానికి దాన్ని కారణంగా పేర్కొనవద్దు.

అధికారుల నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ఇచ్చిన ఆమోదాన్ని ఎందుకు రద్దు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. చట్టప్రకారం ప్రతి కాలేజీ దరఖాస్తును పరిశీలించాలి. కానీ, అధికారులు అలా వ్యవహరించలేదు.

జూలై 26న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటులో సింగిల్‌ జడ్జి పొరపడ్డారు. అందువల్ల కాలేజీల దరఖాస్తులను తిరస్కరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, సింగిల్‌ జడ్జి ఆదేశాలను రద్దు చేస్తున్నాం’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.

#Tags