ESE 2025 Notification : కీలక మార్పులతో కొత్తగా ఈఎస్‌ఈ 2025 నోటిఫికేషన్.. మొత్తం 457కు పెరిగిన పోస్ట్‌ల సంఖ్య
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు చెందిన కొన్ని విభాగాల్లోని పోస్ట్‌ల భర్తీకీ ఈఎస్‌ఈ పరీక్షలో
ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈఎస్‌ఈ–2025 దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది! పరీక్ష తేదీలను కూడా రీ–షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఈఎస్‌ఈ–2025 తాజా మార్పులు, కొత్తగా చేర్చిన పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర సమాచారం..
ప్రస్తుతం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లోని ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేస్తోంది. తాజాగా.. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు చెందిన కొన్ని విభాగాల్లోని పోస్ట్‌ల భర్తీకీ ఈఎస్‌ఈ పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకోనుంది.
TIFR Temporary Jobs : టీఐఎఫ్‌ఆర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు
విద్యార్హతలు
➾ దరఖాస్తు చేయదలచుకుంటున్న విభాగానికి సంబంధించిన బ్రాంచ్‌తో బీటెక్ ఉత్తీర్ణత, చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు పర్సనల్ ఇంటర్వ్యూ సమయానికి ఉత్తీర్ణత పొంది సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
➾ వయసు: జనవరి 1, 2025 నాటికి 21–30 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
సివిల్స్, ఈఎస్‌ఈ
తాజా మార్పుల ప్రకారం–ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు సంబంధించిన కొన్ని పోస్ట్‌లను ఈఎస్‌ఈ ర్యాంకుతో నియామకాలు చేపడతారు. మరికొన్ని పోస్టులను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ర్యాంకుతో.. రైల్వే శాఖలోని ట్రాఫిక్, పర్సనల్ అండ్ అకౌంట్స్ విభాగాల్లోని పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈఎస్‌ఈ ర్యాంకు ఆధారంగా.. రైల్వే శాఖలోని సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్స్, స్టోర్స్ విభాగాల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
NICL Jobs : ఎన్‌ఐసీఎల్‌లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టులు
ఈఎస్‌ఈ పెరిగిన పోస్ట్‌ల సంఖ్య
ఐఆర్‌ఎంఎస్‌లోని నిర్దేశిత విభాగాల్లోని పోస్ట్‌లను కూడా ఈఎస్‌ఈ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఈఎస్‌ఈ–2025లో పోస్ట్‌ల సంఖ్య పెరిగింది. తొలి నోటిఫికేషన్‌లో 232 పోస్ట్‌లనే పేర్కొనగా.. ఐఆర్‌ఎంఎస్‌లోని పోస్ట్‌లను కూడా కలపడంతో మొత్తం పోస్ట్‌ల సంఖ్య 457కు పెరిగింది.
మళ్లీ దరఖాస్తు అవకాశం
ఈఎస్‌ఈ–2025 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 8న ముగిసింది. అయితే కొత్తగా ఐఆర్‌ఎంఎస్‌లోని విభాగాలను కూడా ఈఎస్‌ఈ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈఎస్‌ఈ–2025కు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నారు. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 22 వరకు కొత్త అప్లికేషన్ విండో అందుబాటులో ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ విండో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్‌ఈ–2025 రీ–షెడ్యూల్
ఈఎస్‌ఈ–2025 పరీక్షలను కూడా రీ–షెడ్యూల్ చేశారు. తొలిదశ ప్రిలిమినరీ పరీక్షను 2025 ఫిబ్రవరి 9 బదులుగా 2025 జూన్ 8న; అదే విధంగా.. రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్‌ను 2025 జూన్ 22బదులు 2025 ఆగస్ట్ 10న నిర్వహించనున్నారు.
Junior Officer Posts : ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 153 జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులు
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఈఎస్‌ఈ నియామక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు దశలు రాత పరీక్షలు కాగా, మూడో దశను పర్సనల్ ఇంటర్వ్యూగా పేర్కొన్నారు. అవి..స్టేజ్–1(ప్రిలిమినరీ ఎగ్జామినేషన్); స్టేజ్–2(మెయిన్ ఎగ్జామినేషన్); స్టేజ్–3 (పర్సనాలిటీ టెస్ట్).
తొలిదశ ప్రిలిమినరీ
➾ ఎంపిక ప్రక్రియలో స్టేజ్–1గా పేర్కొనే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అవి.. పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్);పేపర్–2 (ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్ట్).
➾ పేపర్–1ను 200 మార్కులు, పేపర్–2ను 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.ప్రిలిమినరీ పరీక్షలోని పేపర్–1 అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకే మాదిరిగా ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
➾ పేపర్–2 మాత్రం అభ్యర్థి దరఖాస్తు సమయంలో పేర్కొన్న సబ్జెక్ట్‌తో జరుగుతుంది.
రెండో దశ మెయిన్‌కు 600 మార్కులు
ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్(వ్యాస రూపం) విధానంలో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఏడుగురు లేదా ఎనిమిది మందిని చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు చొప్పున మొత్తం ఆరు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న విభాగానికి సంబంధించిన పేపర్లలో ఈ పరీక్ష జరుగుతుంది.
Admissions: ANUలో ‘టీవీ అండ్ ఫిలిం’ పీజీ కోర్సుకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ
ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌గా పేర్కొనే పర్సనల్ ఇంటర్వ్యూ. స్టేజ్–2 మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరిని చొప్పున (1:2 నిష్పత్తిలో) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఇంజనీరింగ్ సర్వీసెస్ పట్ల ఉన్న ఆసక్తి, అందులోనూ ప్రభుత్వ రంగంలో పని చేయాలనుకునేందుకు గల కారణాలు, వ్యక్తిత్వం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియను 200 మార్కులకు నిర్వహిస్తారు.
☛ Join our Telegram Channel (Click Here)
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేలా!
తొలి దశకు ఇలా
తొలి దశ ప్రిలిమ్స్ పేపర్–1(జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్)లో∙ మొత్తం పది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మొదటి టాపిక్‌గా పేర్కొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిని మినహాయిస్తే మిగతా తొమ్మిది టాపిక్స్ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ అకడమిక్స్‌లో అభ్యసించేవే. అకడమిక్స్ పరంగా బేసిక్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటే.. ఈ పేపర్‌లో రాణించడం సులభమే. ప్రిలిమ్స్ పేపర్–2లో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన ప్రశ్నలతో ఉంటుంది. అకడమిక్‌గా సంబంధిత సబ్జెక్ట్‌లో పట్టున్న అభ్యర్థులు సులభంగా ఈ పేపర్‌ను గట్టెక్కొచ్చు.
మెయిన్ మరింత పటిష్టంగా
స్టేజ్–1 ప్రిలిమినరీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఆరు నుంచి ఏడుగురు అభ్యర్థులను (1:6 లేదా 1:17 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఆయా టెక్నికల్ టాపిక్స్‌కు సంబంధించి తాజా సామాజిక పరిస్థితులను అన్వయిస్తూ చదవడం కూడా ఉపకరిస్తుంది. ఉదాహరణకు టెలికమ్యూనికేషన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇటీవల కాలంలో ప్రాధాన్యం పొందుతున్న 5–జి టెక్నాలజీస్‌ను అకడమిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం లాభిస్తుంది. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్‌లోæరోబోటిక్స్‌కు సంబంధించి తాజా వాస్తవ పరిస్థితులను అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. ఇదే వ్యూహాన్ని ఇతర విభాగాల (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) అభ్యర్థులు కూడా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
కో–ఆర్డినేషన్
ఈఎస్‌ఈ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో.. అనుసంధాన దృక్పథంతో అడుగులు వేయాలి. స్టేజ్–1 ప్రిలిమ్స్‌లోని పేపర్–2, మెయిన్ ఎగ్జామినేషన్‌లోని రెండు సబ్జెక్ట్ పేపర్లు అభ్యర్థులు చదివిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించినవే. వీటిని అనుసంధానం చేసుకుంటూ చదివే అవకాశం ఉంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్‌లో గట్టెక్కే విధంగా ఎక్కువ దృష్టి పెట్టాలి. యూపీఎస్‌సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం–ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కు దాదాపు ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ పూర్తి చేసిన తర్వాత మెయిన్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి.
కాన్సెప్ట్స్, అప్లికేషన్ అప్రోచ్
ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయానికి ఆయా సబ్జెక్ట్‌లలోని కాన్సెప్ట్స్‌పై పూర్తి అవగాహన పొందడమే కాకుండా.. వాటిని అన్వయ దృక్పథంతో అధ్యయనం చేయడం ముఖ్యం. ఫలితంగా పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రీవియస్ పేపర్లను సాధన చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. మెయిన్స్ కోణంలో అకడమిక్‌గా తమకు పట్టున్న టాపిక్స్‌పై మరింత అవగాహన పెంచుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
☛ Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం
➾ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➾ దరఖాస్తుకు చివరి తేదీ: 2024, నవంబర్ 22
➾ ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: నవంబర్ 23 నుంచి 29 వరకు.
➾ ప్రిలిమినరీ (స్టేజ్–1) పరీక్ష తేదీ: 2025 జూన్ 8
➾ మెయిన్ ఎగ్జామినేషన్ (స్టేజ్–2) పరీక్ష తేదీ: 2025 ఆగస్ట్ 10
➾ తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్
➾ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
➾ వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in