TS EAPCET 2024 Counselling:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ ..... 75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే

TS EAPCET 2024 Counselling:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ ..... 75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ తొలి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆప్షన్లకు ఇచ్చిన గడువు ముగిసింది. 96 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. వివిధ కాలేజీలు, బ్రాంచీలకు మొత్తం 62 లక్షల ఆప్షన్లు అందినట్టు అధికారు లు తెలిపారు. వాస్తవానికి ఆప్షన్ల గడు వు 15వ తేదీతో ముగిసింది.

కొత్తగా 2,640 సీట్లు పెరగడంతో గడువును 18 వరకు పొడిగించారు. 19న సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ ఆప్షన్ల గడువు పొడిగించడంతో ఈ తేదీలో మార్పు చోటు చేసుకుంది. అందిన ఆప్షన్లపై సాంకేతిక విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. ఒకటి రెండురోజుల్లో సీట్ల కేటాయింపు చేపట్టే వీలుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో 11 వేల సీట్లను ప్రైవేటు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని కోరాయి. కానీ ప్రభుత్వం దీనికి అనుమతించలేదు. ఈ సీట్లపై మొదటి కౌన్సెలింగ్‌ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఇదీ చదవండి: Engineering Counselling 2024: Approval for 63,000 Seats for Academic Year 2024–25!

75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే
రాష్ట్రంలోని 173 కాలేజీలు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 1,01,661 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో తొలి విడత 72,741 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులోనే పెరిగిన 2,640 సీట్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఆప్షన్లలో 75 శాతం విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులనే ఎంచుకున్నారు. 

ఎంసెట్‌లో వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులంతా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, టాప్‌ 5లో ఉన్న ప్రైవేటు కాలేజీలకు సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్‌ బ్రాంచీలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. జేఈఈ ద్వారా ‘నిట్‌’లో సీట్లు పొందిన వాళ్లు కూడా టాప్‌ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 80 శాతం విద్యార్థులు సీట్లు వచ్చినా చేరే అవకాశం ఉండదు.

#Tags