Paris Olympics: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. పాకిస్తాన్‌ ప్లేయర్‌కు స్వర్ణ పతకం!

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్ చోప్రా రజత(సిల్వర్) పతకం సాధించాడు.

ఆగ‌స్టు 8వ తేదీ అర్ధరాత్రి జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్‌ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోరుతోనే నీరజ్‌కు రజత పతకం ఖరారైంది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో నీరజ్‌ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిని వ్య‌క్తిగా నిలిచాడు.

ఇందులో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 27 ఏళ్ల నదీమ్‌ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీమ్‌ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్‌ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్‌ థోర్‌కిల్డ్‌సన్‌ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీమ్‌ బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.  

పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం..
వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్‌ చరిత్రలో పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం నదీమ్‌ ద్వారా లభించింది. గతంలో పాకిస్తాన్‌ హాకీ జట్టు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ రెజ్లర్‌ మొహమ్మద్‌ బషీర్‌ కాంస్యం.. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో బాక్సర్‌ హుస్సేన్‌ షా కాంస్యం సాధించారు.  

నాలుగో భారత ప్లేయర్‌గా..
ఒలింపిక్స్‌ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్‌ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్‌ సుశీల్‌ (2008 బీజింగ్‌; కాంస్యం.. 2012 లండన్‌; రజతం), షట్లర్‌ పీవీ సింధు (2016 రియో; రజతం.. 2020 టోక్యో; కాంస్యం), షూటర్‌ మనూ భాకర్‌ (2024 పారిస్‌; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. 

Vinesh Phogat: ఖ‌రారైన ఒలంపిక్ ప‌త‌కాన్ని కోల్పోయిన వినేశ్‌ ఫొగాట్‌.. రజతం కూడా ఇవ్వరా.. కార‌ణం ఇదేనా..

#Tags