Google Wallet India : గుడ్‌న్యూస్‌.. భారత్‌లోకి గూగుల్‌ వ్యాలెట్‌ వచ్చేసింది.. ఎలా వాడాలంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : బ్యాంకు కార్డులు, టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్‌ డిజిటల్‌ వ్యాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది.

భారత్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వ్యాలెట్‌ను తీసుకొచ్చారు. దీంట్లో బ్యాంకు కార్డులు, టికెట్లు, పాసులు, ఐడీలను భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

దీన్ని తీసుకురావడం వల్ల..
డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు లాయల్టీ, గిఫ్ట్‌ కార్డులను సైతం గూగుల్‌ వ్యాలెట్‌కు యాడ్‌ చేసుకోవచ్చు. దీన్ని తీసుకురావడం వల్ల గూగుల్ పే పై ఎలాంటి ప్రభావం ఉండదు. దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్‌గా కొనసాగిస్తామని గూగుల్‌ స్పష్టం చేసింది. ప్రధానంగా లావాదేవీలయేతర అవసరాల కోసమే వ్యాలెట్‌ను రూపొందించినట్లు తెలిపింది.

Google Wallet ఎలా వాడాలంటే..?
☛ చెల్లింపు కార్డ్‌లను Google Walletకు అనుసంధానిస్తే.. గూగుల్‌ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు. పైగా చెల్లింపుల వివరాలన్నీ సురక్షితంగా ఉంటాయి.
☛ ఫోన్‌లోనే మెట్రో కార్డ్‌లు, విమాన టిక్కెట్లు, బస్ పాస్‌లు తీసుకెళ్లొచ్చు. గూగుల్‌ సెర్చ్‌ నుంచి అందిన సమాచారంతో ప్రయాణ సమయాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌లో నేరుగా ట్రాన్సిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని లోడ్ చేసుకోవచ్చు.
☛ లాయల్టీ, గిఫ్ట్ కార్డ్‌లను గూగుల్‌ వ్యాలెట్‌కు (Google Wallet) అనుసంధానిచొచ్చు. ఫలితంగా వాటి గడువు ముగిసేలోపు ప్రయోజనాన్ని పొందేలా ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.
☛ క్రికెట్‌ మ్యాచ్‌, సినిమా లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ షో టికెట్లను వ్యాలెట్‌కు జత చేసుకోవచ్చు. తద్వారా ఆ సమయానికి వ్యాలెట్‌ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఫలితంగా ఏమాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా ఉంటారు.
☛ Google Walletలో భద్రపరిచే ప్రతీ సమాచారం సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2-స్టెప్‌ వెరిఫికేషన్‌, ఫైండ్‌ మై ఫోన్‌, రిమోట్‌ డేటా ఎరేజ్‌, కార్డు నంబర్లను బహిర్గతం చేయకుండా ఎన్‌క్రిప్టెడ్‌ పేమెంట్‌ కోడ్‌ వంటి గూగుల్‌ భద్రతా ఫీచర్లన్నీ వ్యాలెట్‌కూ వర్తిస్తాయి.

#Tags