Caspian Sea: ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సుకు పర్యావరణ సెగ

ప్రపంచంలోనే అతి పెద్దదైన కాస్పియన్‌ సరస్సు ఉనికి ప్రమాదంలో పడింది. రోజురోజుకూ నీరు తగ్గిపోయి కుంచించుకుపోతోంది.

కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. 
 
కాస్పియన్‌ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. దీని సముద్రతీరం 4,000 మైళ్ళకు పైగా విస్తరించి ఉంది. కజకిస్తాన్, ఇరాన్, అజర్‌బైజాన్, రష్యా, తుర్క్‌మెనిస్తాన్‌ దేశాలు.. చేపలు పట్టడం, వ్యవసాయం, పర్యాటకం, త్రాగునీటితో పాటు చమురు, గ్యాస్‌ నిల్వల కోసం కాస్పియన్‌పైనే ఆధారపడతాయి. ఆనకట్టలు, అధిక వెలికితీత, కాలుష్యం, పెరుగుతున్న వాతావరణ సంక్షోభంతో కాస్పియిన్‌ క్షీణిస్తోంది. 

కొన్ని దశాబ్దాలుగా ఈ క్షీణత వేగవంతమవుతోంది. 130 నదుల నుంచి కాస్పియన్‌ సరస్సులోకి నీరు ప్రవేశిస్తుంది. అందులో 80 శాతం నీరు ఒక్క ఓల్గా నది నుంచే వస్తుంది. ఐరోపాలోనే పొడవైన నది ఓల్గా. దీనిపై రష్యా 40 ఆనకట్టలను నిర్మించింది. మరో 18 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాస్పియన్‌కి నీటి ప్రవాహాన్ని తగ్గించాయి. ఓల్గా దిగువ ప్రాంతాలు అనేక పారిశ్రామిక కేంద్రాలకు నిలయంగా ఉన్నందున, రసాయన, జీవ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.

ఈ క్షీణతలో వాతావరణ మార్పులు సైతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్‌ నుంచి వచ్చే కాలుష్యం కూడా కాస్పియన్‌ను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు బాషీ్పభవన రేటును పెంచి.. అస్తవ్యస్తమైన వర్షపాతానికి కారణమవుతున్నాయి. చమురు వెలికితీత, ఇతర పరిశ్రమల నుంచి వస్తున్న కారకాలతో కాస్పియన్‌ కలుషితమవుతోంది. 

Global Water Crisis: దారి తప్పిన జలచక్రం.. చరిత్రలో ఇదే తొలిసారి! ఏమిటీ జలచక్రం..?

వీటన్నింటితో.. కాస్పియన్‌ నీటి మట్టం పడిపోవడం 1990 మధ్య నుంచే ప్రారంభమైంది. 2005 నుంచి ఈ వేగం పెరిగింది. సుమారు 5 అడుగుల నీటిమట్టం తగ్గిందని జర్మనీలోని బ్రెమెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్‌ సిస్టమ్స్‌ మోడలర్‌ మాథియాస్‌ ఫ్రాంజ్‌ వెల్లడించారు. ఈ శతాబ్దం చివరి నాటికి 8 నుంచి 18 మీటర్లు (26 నుంచి 59 అడుగులు) క్షీణించే అవకాశం ఉందని పరిశోధన ఒకటి అంచనా వేసింది. 

సంక్షోభంలోకి ఐదు దేశాలు.. 
సరస్సు క్షీణత.. దీనిపై ఆధారపడి ఉన్న ఐదు దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. చేపలు పట్టడం, పర్యాటకం తగ్గిపోతుంది. ఓడరేవు నగరాల్లో నౌకలు దిగడం సమస్యగా మారడంతో షిప్పింగ్‌ పరిశ్రమ దెబ్బతింటుంది. దేశాల మధ్య రాజకీయంగానూ కీలక పరిణామాలు సంభవిస్తాయి. వనరుల కోసం పోటీ పెరుగుతుంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై కొత్త విభేదాలకు దారితీస్తుంది. 

ఇక కాస్పియన్‌ను ఆవాసంగా చేసుకున్న ప్రత్యేకమైన వన్యప్రాణుల పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. వందలాది జంతుజాలానికి నిలయమైన అడవి కూడా అంతరించనుంది. కానీ నీరు తగ్గుముఖం పట్టడం వల్ల దాని లోతుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు క్షీణిస్తాయి. దీంతో కొంత కాలానికి అందులోని జంతుజాలం తుడిచిపెట్టుకుపోతుంది. కాస్పియన్‌ సముద్రంలో అనేక రకాల స్టర్జన్‌ జాతులు ఉన్నాయి. ఈ చేప అత్యంత విలువైన, రుచికరమైన కేవియర్‌ను ఇస్తుంది.

Three Gorges Dam: భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న 'త్రీ గోర్జెస్‌ డ్యామ్‌'

ప్రపంచంలోని కేవియర్‌లో 80–90% మధ్య కాస్పియన్‌ నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. స్టర్జన్‌ చేపలు వేగంగా కనుమరుగవుతున్నాయని, త్వరలో అంతరించిపోయే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ఇది బయటకు కనిపించని ఒక భారీ సంక్షోభం. సముద్ర క్షీరదాలైన కాస్పియన్‌ సీల్స్‌కు కూడా ప్రమాదకర సంకేతం. ఈ సంక్షోభానికి పరిష్కారాలు తక్కువ. ఇందుకు ఏ ఒక్క దేశాన్ని నిందించలేమని, కానీ సమిష్టి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అరల్‌ సముద్ర విపత్తు పునరావృతం అవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

సముద్ర మట్టాలు పెరుగుతుంటే కాస్పియన్‌ ఎందుకు తగ్గుతోంది? 
వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలను పెంచుతున్నాయి. కానీ కాస్పియన్‌ వంటి భూపరివేష్టిత సరస్సులది భిన్నమైన కథ. ఇవి నదుల నుంచి ప్రవహించే నీరు, వర్షపాతం సమతుల్యతపై ఆధారపడతాయి. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ఈ సమతుల్యత దెబ్బతింటోంది. 

దీంతో అనేక సరస్సులు కుంచించుకుపోతున్నాయి. భవిష్యత్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎక్కువ శ్రమా అక్కర్లేదు. ఎందుకంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల మధ్య ఉన్న అరల్‌ సముద్రం దాదాపు అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటిగా ఉన్న అరల్‌.. ఇప్పుడు అంతంతమాత్రంగా మిగిలింది.

Climate Change: గతి తప్పుతున్న రుతుపవనాలు.. దీనికి కారణం ఇదే..

#Tags