Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1
2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి.
Mulapeta Port: మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన.. పోర్టు విశేషాలివే..
గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలున్నాయి.