Maori Crown: మావోరి తెగకు కొత్త రాణి ఎన్గావాయ్‌ హోనోయ్‌తే పొపాకీ

న్యూజిలాండ్‌లోని మావోరి తెగకు కొత్త రాణి పట్టాభిషిక్తురాలయ్యారు.

తండ్రి, ఏడవ రాజు టుహెటియా పొటటౌ టె వెరోహెరో 69 ఏళ్ల వయసులో గుండెకు శస్త్రచికిత్స తర్వాత మరణించడంతో ఎన్గావాయ్‌ హోనోయ్‌తే పొపాకీ రాణిగా వారసత్వ బాధ్యతలను స్వీకరించారు. నార్త్‌ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 27 సంవత్సరాల ఎన్గావాయ్‌ హోనోయ్‌తే పొపాకీకి మావోరి అధిపతుల మండలి రాజు బాధ్యతల్ని అప్పగించింది. 

మావోరి రాజు ఉద్యమానికి కేంద్రంగా ఉన్న తురంగవేవే మారే వద్ద జరిగిన సభలో ఈ మేరకు ప్రకటించారు. 1858లో మొదటి మావోరి రాజుకు అభిషేకం చేయడానికి ఉపయోగించిన బైబిల్‌తో ఆమెను ఆశీర్వదించారు. తండ్రి శవపేటిక ముందు తర్వాత ఆమె పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అంతిమ వేడుకల్లో హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. తరువాత యుద్ధ పడవల ద్వారా రాజు శవపేటికను వైకాటో నది వెంబడి తీసుకువెళ్లారు. మావోరీలకు పవిత్రమైన తౌపిరి పర్వతం పైన ఖననం చేశారు.  

నిబద్ధత కలిగిన నాయకుడు 
కింగి తుహెటియా మరణం మావోరీలకు, మొత్తం దేశానికి విచారకరమైన క్షణమని మావోరి ఉద్యమ ప్రతినిధి రహుయి పాపా అన్నారు. రాజు మరణంతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని న్యూజిలాండ్‌ ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు క్రిస్‌ హిప్కిన్స్‌ అన్నారు. 

న్యూజిలాండ్‌ వాసులను ఏకతాటిపైకి తీసుకురావడంపై దృష్టి సారించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజు టుహీటియా.. మావోరీ, న్యూజిలాండ్‌ ప్రజలందరి పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోపర్‌ లక్సన్‌ ప్రశంసించారు.  

ASCI Chairman: ఏఎస్‌సీఐ నూత‌న చైర్మ‌న్‌గా పార్థ సిన్హా

రెండో రాణి..  
మావోరీ తెగకు రాణిగా భాధ్యతలు స్వీకరిస్తున్న రెండో మహిళగా ఎన్గావాయ్‌ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. అంతకు ముందు ఆమె నాన్నమ్మ టె అరికినుయి డామ్‌ టె అటైరంగికహు మొదటి రాణిగా సేవలందించారు. మావోరీలందరినీ సంఘటితం చేసిన గొప్ప నాయకిగా ఆమెకు మంచి పేరుంది. ఆమె కుమారుడు టుహెటియా సైతం తల్లి బాటలోనే పయనించారు. మావోరిని లక్ష్యంగా చేసుకునే విధానాలకు ఎదురు నిలిచిపోరాడా లని పిలుపునిచ్చారు. 

ఎన్గావాయ్‌ మావోరీ సాంస్కృతిక అధ్యయనాలలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. మావోరీల రాచరికం 19వ శతాబ్దం నుంచీ కొనసాగుతోంది. బ్రిటిష్‌ వారు న్యూజిలాండ్‌ భూమిని ఆక్రమించకుండా నిరోధించడానికి, మావోరీ సంస్కృతిని పరిరక్షించడానికి వివిధ మావోరీ తెగలు సొంతంగా రాజును ప్రకటించుకుంటుంది.

Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

#Tags