HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 28న రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు.
Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?
ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అవగా... తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
Also read: రాష్ట్రంలోని గ్రామాలలో 58 వేలకు పైగా ప్రదేశాలలో ఉచిత Wi-Fi సౌకర్యాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?
అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.