Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ అక్టోబర్ 24న ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించి జస్టిస్ ఖన్నాను నియమించినట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేసి, 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నాడు.
జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు.
2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు.
Haryana CM: హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం.. 13 మంత్రులు కూడా..
కీలక తీర్పులు వెలువరించిన ఖన్నా..
➣ 2024లో ఎలక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి వీవీప్యాట్లలో 100% ఓట్లను లెక్కించాలని కోరుతూ పిటిషన్‌ను కొట్టివేసారు.
➣ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు.
➣ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చారు.
➣ వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో విడాకులు మంజూరు చేసే అధికారం ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నట్లు 2023లో స్పష్టంచేశారు.
➣ సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందని 2019లో తీర్పు వెలువరించారు.
RBI Deputy Governor: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పొడిగింపు.. ఎన్నిరోజులంటే..