Mann Ki Baat: దేశంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు.. ‘డిజిటల్‌ అరెస్టు’కు భయప‌డొంద‌ని చెప్పిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సైబర్‌ నేరాలు పెరిగిపోతుండడం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేశారు.

ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్‌ అరెస్టు’ ఫ్రాడ్‌ను అక్టోబ‌ర్ 27వ తేదీ ‘మన్‌కీ బాత్‌’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్‌ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. 

‘సైబర్‌ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’ అన్నారు. 

‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ‘1930’కు ఫోన్‌ చేయండి. సైబర్‌ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్‌ మోసాలపై cybercrime.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయండి’ అని సూచించారు.

‘డిజిటల్‌ మోసాలు, ఆన్‌లైన్‌ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్‌ భద్రత కల్పిస్తుంది’ అని ఉద్ఘాటించారు. సైబర్‌ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివర్ణించారు. సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. 

Development Projects: విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ.. ఆ ప్రాజెక్టులు ఏవంటే..

#Tags