First Indian Private Rocket : అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రకు భారత్‌ శ్రీకారం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి ప్రైవేటు రాకెట్‌.. ప్రారంభ్‌ (విక్రమ్‌–ఎస్‌)ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నవంబర్‌18 (శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది.

ఇప్పటిదాకా ప్రైవేటు ఉపగ్రహాలను మాత్రమే ఇస్రో ప్రయోగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారి ప్రైవేటు రాకెట్‌ను సైతం ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇందుకు కేవలం 4.50 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. ప్రారంభ్‌ (విక్రమ్‌–ఎస్‌)ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించింది. స్టార్టప్‌ కంపెనీలు.. స్పేస్‌ కిడ్‌ ఇండియా, ఎన్‌ స్పేస్‌టెక్, అర్మేనియా బజూమ్‌ క్యూ స్పేస్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌కు చెందిన మూడు పేలోడ్‌లను ఈ బుల్లి రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. భవిష్యత్తులో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. వాతావరణ అధ్యయనం కోసం ఈ పేలోడ్లను ప్రయోగించారు.

భూమి నుంచి సుమారు 89.5 కిలోమీటర్లు ఎత్తులో సబ్‌–ఆర్బిటల్‌లోకి విజయవంతంగా వెళ్లిన రాకెట్‌ తిరిగి శ్రీహరికోట సముద్రతీరానికి 135 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయింది. అయితే రాకెట్‌ పైకి వెళ్లిన సమయంలో అందులో ఉన్న పేలోడ్స్‌ వాతావరణంలో ఉన్న తేమ ఇతర వివరాల సమాచారాన్ని అందించాయి.   ఇదొక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ  ట్వీట్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్, షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్, ఇన్‌స్పేస్‌ ఇండ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ గోయెంకా తదితరులు పాల్గొన్నారు. 

ప్రయోగ సమయంలో..
రాకెట్‌ బరువు: 545 కిలోలు 
రాకెట్‌ పొడవు: 6 మీటర్లు 
రాకెట్‌ వెడల్పు: 0.375 మీటర్లు 
భూమి నుంచి ఎత్తు: 89.5 కిలోమీటర్లు 
రాకెట్‌ ప్రయోగం పూర్తి చేసిన సమయం: 4.50 నిమిషాలు

 

Vikram-S: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ కంపెనీ

#Tags