US Biosecure Act: అమెరికా చట్టం.. భారత్‌కు లాభం..!

దేశీయ ఫార్మా కాంట్రాక్ట్‌ తయారీ వ్యాపార విభాగం త్వరలోనే రెట్టింపు అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభుత్వ సంస్థలు చైనా ఫార్మా కంపెనీల కొనుగోళ్లు జరపకుండా అమెరికా బయోసెక్యూర్‌ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. చైనా నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా భారత్‌కు మళ్లుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్‌ తయారీ సెగ్మెంట్‌ వచ్చే మూడేళ్లలో రెండింతలు కానుంది. అలాగే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ సెగ్మెంట్‌ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మోర్డోర్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక విడుదల చేసింది.

నివేదికలోని వివరాల ప్రకారం.. 
2024లో అంతర్జాతీయంగా కాంట్రాక్ట్‌ అభివృద్ధి, తయారీ సెగ్మెంట్‌ (సీడీఎంవో) 22.51 బిలియన్‌ డాలర్లు(రూ.1.8 లక్షల కోట్లు)గా ఉంది. ఇది ఏటా 14.67 శాతం వృద్ధితో 2029 నాటికి 44.63 బిలియన్‌ డాలర్ల(రూ.3.7 లక్షల కోట్లు)కు చేరనుంది. ఫార్మా విభాగం గణాంకాల ప్రకారం దేశీయంగా కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ (సీఆర్‌వో) సెగ్మెంట్‌ వార్షికంగా 10.75 శాతం వృద్ధితో 2030 నాటికి 2.5 బిలియన్‌ డాలర్ల(రూ.20 వేలకోట్లు)కు చేరనుంది. భారతీయ సీడీఎంఏ సెగ్మెంట్‌ ఇప్పటికే అభివృద్ధి చెందినా, బయోసెక్యూర్‌ చట్టం అమల చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌ వాటా ఇదే.. 
ప్రస్తుతం చైనా సీడీఎంవో పరిశ్రమకు అంతర్జాతీయంగా 8 శాతం మార్కెట్‌ వాటా ఉండగా, భారత్‌కు 2.7 శాతం వాటా ఉంది. చైనా వాటాను కొల్లగొట్టడానికి ఈ చట్టం భారత్‌కు బాగా ఉపకరించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు అమెరికన్‌ సంస్థలు ఉత్పత్తి కొనుగోళ్ల కోసం పలు భారతీయ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు వివరించాయి. సుమారు 60 శాతం భారతీయ ఫార్మా కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించాయి.  

International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం

గట్టి పోటీ కూడా..
బయోసెక్యూర్‌ చట్టంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మన ఫార్మా కంపెనీలకు వెంటనే ప్రయోజనాలు లభించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, సింగపూర్‌ వంటి దేశాల నుంచి మన కంపెనీలకు గట్టి పోటీ ఉండొచ్చని వివరించాయి. అమెరికాలో ప్రస్తుతం 120 ఔషధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా తోడ్పాటు ఉన్న ఈ ప్రాజెక్టులు మన వైపు మళ్లేందుకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఒప్పందాలను మరికొంత కాలం కొనసాగించుకునేందుకు వీలు కల్పించే నిబంధనల వల్ల తక్షణం ఆర్థిక లబ్ధి చేకూరకపోవచ్చని వివరించాయి. 

అయితే, భారతీయ కంపెనీలకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిప్లా, సింజీన్‌ వంటి సీడీఎంవోలు తక్కువ వ్యయాలతో ఔషధాలు తయారు చేయగలవు. అలాగే వాటికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు కూడా అందిస్తోంది. మొత్తం మీద బయోసెక్యూర్‌ చట్టమనేది భారతీయ సీడీఎంవో విభాగానికి గేమ్‌ చేంజర్‌గా ఉండగలదని విశ్లేషకులు తెలిపారు.

World Population: 1000 కోట్లు దాటనున్న ప్రపంచ జనాభా.. ఎప్ప‌టిలోపు అంటే..

#Tags