IUCN: అంతరించిపోతున్న జీవజాలం వివరాలను నమోదు చేసే సంస్థ?

అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్‌(ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) నమోదు చేస్తుంటుంది.

తాజాగా కొమొడో డ్రాగన్‌ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితా(రెడ్‌ లిస్ట్‌)లోకి ఎక్కిందని ఐయూసీఎన్‌ తెలిపింది. ప్రస్తుతం ఐయూసీఎన్‌ డైరెక్టర్‌గా బ్రూనో ఒబెర్లె ఉన్నారు. ఐయూసీఎన్‌ తెలిపిన వివరాల ప్రకారం...

  • 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయింది.
  • పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయి.
  • చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్‌ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి.
  • షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణం.
  • సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించింది.
  • ఐయూసీఎన్‌ సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి.
  • పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉంది. 
  • కరిగిపోతున్న మంచుతో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్‌ పెంగ్విన్లు నశించిపోయే ప్రమాదం ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  కొమొడో డ్రాగన్‌ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితా(రెడ్‌ లిస్ట్‌)లోకి ఎక్కింది
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు    : ఐయూసీఎన్‌(ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) 
ఎందుకు  : పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ కారణాల వల్ల...

#Tags