Baryl Vanneihsangi: 32 ఏళ్ల‌కే ఎమ్మెల్యే అయిన అమ్మాయి.. ఇప్ప‌టికే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పాపుల‌ర్..

మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్‌ మూమెంట్‌ (జెడ్‌పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్‌ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు.

రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్‌ వన్నెహ్సోంగి ‘జెడ్‌పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్సురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్‌ సృష్టించింది.

మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్‌ మూమెంట్‌ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్‌ మూమెంట్‌’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు.
‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే బారిల్‌ వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది.

Manisha Padhi: దేశంలోనే తొలి మహిళా ఏడీసీ.. మా కూతురే మా శక్తి అంటున్న త‌ల్లిదండ్రులు..

రాజకీయాలు మహిళలకు తగనివి..
బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. ఆమె కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది.



హైస్కూల్‌ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌ లోని నార్త్‌ ఈస్ట్‌ హిల్‌ యూనివర్శిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’. ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.

రాజకీయాలు అంటే అంత తేలిక కాదు..
‘రాజకీయాలు అంటే టీవి మైక్‌ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్‌.. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది.

Woman Success Story: అమ్మాయివై ఇలాంటి వ్యాపారం చేస్తావా అన్నారు.. కానీ నేడు వంద‌ల కోట్లు సంపాదిస్తున్నా.. ఎలా అంటే..

1,414 ఓట్ల మెజార్టీతో గెలుపు..
మిజోరంలోని ఐజ్వాల్‌ సౌత్‌–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్‌ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్‌ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతో మందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్‌స్టాగ్రామ్‌ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్‌లు ఉన్నారు.

‘భవిష్యత్‌ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి.

యంగ్, ఎనర్జిటిక్‌ అండ్‌ డేరింగ్‌ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది.

Indian Economy: మూడో అతిపెద్ద ఎకానమీగా అవ‌త‌రిచ‌న‌నున్న‌ భారత్‌.. ఎప్ప‌టిక‌ల్లా అంటే..

#Tags