Naval Exercise: 2022 మిలాన్‌ విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి?

నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్‌ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. విశాఖలోని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్‌–2022 విన్యాసాలు నిర్వహించనున్నారు. 2022, ఫిబ్రవరిలో జరిగే విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం 46 దేశాలకు ఆహ్వానం పంపగా.. 30 దేశాలు పాల్గొంటున్నట్లు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. సీ ఫేజ్, హార్బర్‌ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు.

వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ విశాఖ కేంద్రంగా మిలాన్‌ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ–2016కు విశాఖ నగరం వేదికగా నిలిచిన విషయం విదితమే.

సమావేశం అని అర్థం..

వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్‌ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలాన్‌ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం.

1995లో తొలిసారి..

  • 1995లో తొలిసారి జరిగిన మిలాన్‌ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 
  • సాధారణంగా రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 
  • 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. 
  • 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లు నిర్వహించడం వల్ల మిలాన్‌ విన్యాసాలు జరగలేదు. 
  • మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్‌ విన్యాసాలు జరిగాయి.

చ‌ద‌వండి: భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు ఏ దేశంలో సమావేశం కానున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, ఫిబ్రవరిలో మిలాన్‌ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : భారత నౌకాదళం
ఎక్కడ    : ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags