Bharat Ratna Award: ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 9న మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కు కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కా­రం ‘భారతరత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇప్పటివరకు 53 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురికి ప్రదానం చేశారు. అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్‌కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో ఫిబ్రవరి 4వ తేదీన పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్‌ చౌరాసియా, గాయకుడు శంకర్‌ మహాదేవన్, వయోలిన్‌ కళాకారుడు గణేశ్‌రాజ గోపాలన్, డ్రమ్స్‌ కళాకారుడు సెల్వగణేశ్‌ వినాయక్‌ రామ్‌లకు గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్‌ హుస్సేన్‌ కు మొత్తం మూడు, రాకేశ్‌ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్‌ మహాదేవన్, గణేశ్‌ రాజగోపాలన్, సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్, జాకీర్‌హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. 
 

#Tags