CTET 2024 Notification : CTET 2024 నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు.. పరీక్షావిధానం.. దరఖాస్తు వివరాలు ఇవే..
తాజాగా సీబీఎస్‌ఈ.. సీటెట్ జనవరి-2024కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.దీని వ్యాలిడిటీ జీవిత కాలం ఉంటుంది. సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. సీటెట్ పేపర్–1 ఒకటి నుంచి ఐదవ తరగతి బోధన కోసం, సీటెట్ పేపర్–2 ఆరు నుంచి 9వ తరగతి వరకు బోధించాలనే వారి కోసం ఉంటుంది. 20 భాషలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అర్హతలు ఇవే.. :
సీటెట్ పేపర్–1 : 50% మార్కులతో ఇంటర్మీడియట్ + డీఈడీ చేసి ఉండాలి. లేదా డిగ్రీ + బీఈడీ చేసి ఉండాలి.
సీటెట్ పేపర్ 2 : 50% మార్కులతో డిగ్రీ + డీఈడీ లేదా బీఈడీ చేసి ఉండాలి.
పేపర్-1 ఇలా..
- ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత ఉండాలి. (లేదా)
- 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
- ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం-బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులుగా పేర్కొన్నారు. దీంతో.. సీటెట్ టెట్-పేపర్-1కు బీఈడీ ఉత్తీర్ణులకు కూడా అర్హత లభించింది.
పేపర్-2 అర్హత ఇలా..
- బీఏ/బీఎస్సీ/బీకామ్‌లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేష¯Œ /బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణులవ్వాలి. లేదా నాలుగేళ్ల బీఏబీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
(లేదా) - బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణులై బీఈడీ/బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
దరఖాస్తు ఫీజు :
☛ రూ.1000/- (ఎదైనా ఒక పేపర్‌కు)
☛ రూ. 1200/- ( పేపర్ 1 & 2 లకు)
☛ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500/- (ఎదైనా ఒక పేపర్ కు), రూ.600/- (పేపర్ 1 &2 లకు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే :
గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు ఇవే:
☛ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : నవంబర్ 03, 2023.
☛ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది : నవంబర్ 23, 2023.
☛ ఫీజు చెల్లింపు చివరి తేది : నవంబర్ 23, 2023.
☛ పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష
☛ పరీక్ష తేదీ: జనవరి 21, 2024.
CTET–2024 పరీక్షావిధానం :
CTET–2024 పేపర్-1 పరీక్షావిధానం ఇలా :
పేపర్-1 పరీక్ష అయిదు విభాగాల్లో 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు-30 మార్కులు; లాంగ్వేజ్-1, 30 ప్రశ్నలు-30 మార్కులు; లాంగ్వేజ్-2, 30 ప్రశ్నలు-30 మార్కులు; మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు; ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు-30 మార్కులకు ఉంటాయి.
పేపర్-2 పరీక్షావిధానం ఇలా..
- పేపర్-2ను రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు.
- మొత్తం అయిదు విభాగాల్లో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోఈ పరీక్ష ఉంటుంది.
- ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు-30 మార్కులు; లాంగ్వేజ్ 1, 30 ప్రశ్నలు-30 మార్కులు; లాంగ్వేజ్ 2, 30 ప్రశ్నలు-30 మార్కులు; మ్యాథమెటిక్స్/సైన్స్ 60 ప్రశ్నలు-60 మార్కులు; (లేదా) సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ 60 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- లాంగ్వేజ్-1 విభాగంలో అభ్యర్థులు తాము ఏ మాధ్యమంలో బోధించాలనుకుంటున్నారో ఆ మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- లాంగ్వేజ్-2 విభాగంలో లాంగ్వేజ్-1లో హాజరైన భాష కాకుండా.. ఇతర లాంగ్వేజ్‌లలో హాజరు కావాలి. మొత్తం 20 లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
కనీస అర్హత మార్కులు ఇలా..
సీటెట్ పేపర్-1, పేపర్-2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులు(70 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు(60 మార్కులు) పొందాలి.
సీటెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే.. జీవిత కాల గుర్తింపు..
సీటెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే..ఆ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది. దీంతో ఒకసారి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఎప్పుడైనా టీచింగ్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.
విజయం సాధించాలంటే..
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి..
ఈ విభాగంలో బోధన, లెర్నింగ్‌కు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను అధ్యయనం చేయాలి. సైకాలజీని చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యాప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్-కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే.. ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
లాంగ్వేజ్ పేపర్లకు ఇలా..
అభ్యర్థులు తాము బోధించాలనుకునే భాషలో నిర్వహించే లాంగ్వేజ్-1 విభాగంలో రాణించేందుకు.. అదే విధంగా మరో ఇతర లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరీక్షించే లాంగ్వేజ్-2 పేపర్‌లో రాణించేందుకు ఆయా భాషా విభాగాలకు సంబంధించి స్కూల్ స్థాయిలో సబ్జెక్ట్ పుస్తకాలను పూర్తిగా చదవాలి. లాంగ్వేజ్-2కు సంబంధించి ఎక్కువ మంది ఇంగ్లిష్‌ను ఎంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని చదవాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లిష్ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్..
పేపర్-1లో ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయిలో.. పేపర్-2లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు.
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్..
ఈ విభాగంలో రాణించేందుకు బోటనీ బేసిక్ అంశాలతోపాటు, పర్యావరణ విషయాలు, సైన్స్ ఇన్ డైలీ లైఫ్ వంటి వాటిపైనా దృష్టి పెట్టాలి.
సైన్స్..
ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కొంత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
సోషల్ స్టడీస్..
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన పరిణామాలతో అప్‌డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.