Union Budget 2024: ఆర్థిక సర్వే, బడ్జెట్‌ మధ్య తేడా ఏమిటంటే..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం కేంద్ర ఆర్థిక సామాజిక సర్వే 2024-25ను విడుదల చేయనున్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. ఆర్థిక సర్వేకు, బడ్జెట్‌కు మధ్య తేడా ఏంటీ.. అనే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.
Union Budget 2024: ఆర్థిక సర్వే, బడ్జెట్‌ మధ్య తేడా ఏమిటంటే..

ఆర్థిక సర్వే అంటే..

దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్‌ వ్యవహరిస్తున్నారు.

ఆర్థిక సర్వే, బడ్జెట్‌  మధ్య తేడా

ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను తెలియజేస్తారు.

ఇదీ చదవండి:  Union Budget: ఆర్థికమంత్రి అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడ‌తారో మీకు తెలుసా?

సర్వేలో ఉండే అంశాలు

దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.

పరిణామ క్రమం

బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 1950-51లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 1964 నుంచి దీన్ని బడ్జెట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి  దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు.

#Tags