B Com General Course : 17 ప్రభుత్వ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సుకు స్వస్తి.. విద్యాశాఖ మంత్రిపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు!

ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులకే పలు డిగ్రీ కోర్సులను రద్దు చేసింది..

తిరుపతి సిటీ: విద్యారంగంపై నూతన ప్రభుత్వ వైఖరి స్పష్టమైంది. ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులకే పలు డిగ్రీ కోర్సులను రద్దు చేసింది. 1960 నుంచి పేద విద్యార్థుల ఆశాజ్యోతిగా వెలుగొందుతూ ఎంతో మంది విద్యార్థులను అకౌంట్స్‌ ప్రొఫెషనల్స్‌గా, అకౌంటెట్లుగా, చార్టెడ్‌ అకౌంటెంట్లుగానూ, కంపెనీలకు మేనేజర్లు, సీఈఓలుగాను తీర్చిదిద్దిన బీకాం జనరల్‌ డిగ్రీకి ప్రభుత్వం మంగళం పాడింది. 2024–25 విద్యా సంవత్సరంలో డిగ్రీ అడ్మిషన్ల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సు ఆప్షన్‌ను తీసివేసింది. దీంతో ఇక బీకాం జనరల్‌ కోర్సు ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదృశ్యమైనట్టే. అయితే టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఈ కోర్సును కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొండిచెయ్యి చూపింది.

TSPSC Group 1 Prelims Results 2024: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీ,కొడుకులు

3వేల మంది విద్యార్థులకు ఎదురుదెబ్బ

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమారు 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్‌ డిగ్రీకి నూతన ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలతో పాటు సరిహద్దు జిల్లాలోని సుమారు 3వేల మంది విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది. బీకాం జనరల్‌ కోర్సులో చేరాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థులకు నిరాశే మిగిలింది. కోర్సు రద్దుపై విద్యార్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

మంత్రి లోకేష్‌ స్పందించకపోతే ఉద్యమమే

కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పెద్దపీట వేసే క్రమంలో ప్రభుత్వ కళాశాలలో బీకాం జనరల్‌ డిగ్రీ కోర్సును రద్దు చేసిందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగే డిగ్రీని ప్రభుత్వం రద్దు చేయడం పేద విద్యార్థుల కడుపు కొట్టడమేనన్నారు. జిల్లాలో సుమారు 1,300 మందికిపైగా విద్యార్థులు ప్రతి ఏటా ఈ కోర్సులో అడ్మిషన్లు పొందుతున్నారని తెలిపారు. ప్రైవేటు కళాశాలల్లో కోర్సును రద్దు చేసి ప్రభుత్వ కళాశాలలో సీట్లు పెంచి కోర్సును కొనసాగించాలని డిమాండు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే స్పందించి బీకాం జనరల్‌ కోర్సును ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ కొనసాగించాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాలతో సంఘటితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Agniveer Notification : అగ్నివీర్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ వ‌య‌స్సు గ‌ల‌వారే అర్హులు!

#Tags