గేట్‌ 2021 ఫలితాల విడుదల.. పీఎస్‌యూల్లో ఉద్యోగాలు సాధించే దారుల గురించి తెలుసుకోండిలా..

తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఉజ్వల భవిష్యత్‌ నిర్మించుకోవాలంటే.. బీటెక్‌ ఒక్కటే సరిపోదు.

. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకుమించి ఉన్నత విద్య కూడా అవసరమవుతోంది. ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ విద్యార్థుల క్రేజీ పరీక్ష.. ‘గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)’. దేశంలో ఎక్కువ మంది రాసే ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో ఇది ఒకటి. గేట్‌తో ఉన్నత విద్యతోపాటు ఇంకా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల ఐఐటీ బాంబే.. గేట్‌ 2021 ఫలితాలు ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) గేట్‌ ద్వారా నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గేట్‌ స్కోరుతో ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య, కెరీర్‌ మార్గాలపై ప్రత్యేక కథనం..

ప్రతి ఏటా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు; ఏడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీలు)లు సంయుక్తంగా గేట్‌ ఎంట్రన్స్‌ను నిర్వహిస్తాయి. గేట్‌ 2021 మొత్తం 27 సబ్జెక్టుల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్‌ అభ్యర్థులతోపాటు, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ అభ్యర్థులకు కూడా గేట్‌ రాసే అర్హత కల్పించారు. గేట్‌ పరీక్ష ప్రతి ఏటా ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో 65 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది. గేట్‌ స్కోర్‌కు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది. దాదాపు 9 లక్షల మంది వరకూ ఈ పరీక్షకు హాజరవుతుంటారు. గేట్‌ అంటే చాలామంది ఉన్నత చదువుల కోసమే అనుకుంటారు. వాస్తవానికి గేట్‌ స్కోర్‌తో అనేక ప్రయోజనాలు పొందొచ్చు. గేట్‌తో ప్రధానంగా ఎంటెక్‌ /ఎంఈ/పీహెచ్‌డీల్లో ప్రవేశంతోపాటు పీఎస్‌యూ కొలువు సొంతం చేసుకోవచ్చు.

ఉన్నత విద్య..
చాలామంది ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఐఐటీల్లో పీజీలో చేరడం ఓ కల. ఈ కలను గేట్‌ స్కోర్‌ ద్వారా నెరవేర్చుకోవచ్చు. గేట్‌లో మంచి స్కోర్‌ సాధిస్తే.. ఐఐటీలు, ఎ¯ŒSఐటీలు, ఐఐఎస్సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లల్లో ఎంటెక్‌/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థి స్పెషలైజేషన్, గేట్‌ స్కోరు, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఇష్టమైన ఇన్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రముఖ ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో పీజీలో చేరాలంటే.. గేట్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. గేట్‌లో మంచి ర్యాంకుతో ప్రవేశం పొందిన అభ్యర్థి.. రెండేళ్ల మాస్టర్స్‌ కోర్సు కాలంలో స్టయిఫండ్‌తోపాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

పరిశోధనలకు మార్గం..
ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో లోతైన పరిజ్ఞానం పొందాలనుకునే అభ్యర్థులకు చక్కటి మార్గం గేట్‌తో ఎంటెక్‌/ఎంఈ. గేట్‌ స్కోర్‌తో ఐఐటీలు, నిట్‌లు తదితర ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్‌/ఎంఈలో ప్రవేశంతోపాటు పలు ఐఐటీల్లో పీహెచ్‌డీ, ఐఐఎంల్లో ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌పీఎం)లో కూడా చేరొచ్చు. తద్వారా పరిశోధనల దిశగా అడుగులు వేయొచ్చు. గేట్‌ స్కోర్‌తో కేంద్ర విద్యాశాఖ అందించే ఫెలోషిప్‌లు అందుకొని.. సీఎస్‌ఐఆర్‌ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో రీసెర్చ్‌ కొనసాగించొచ్చు. రీసెర్చ్‌ అనంతరం దేశ విదేశాల్లో అద్భుత అవకాశాలు అందుకునే అవకాశముంది.

పీఎస్‌యూల్లో కొలువు..
గేట్‌ స్కోరుతో మరో ప్రయోజనం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు. పీఎస్‌యూలు గేట్‌లో నిర్ణీత స్కోరు సాధించినవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. తదుపరి ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకాలు జరుపుతున్నాయి. బీహెచ్‌ఈఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, సెయిల్, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, పీజీసీఐల్, బార్క్‌ వంటి ఎన్నో పీఎస్‌యూలు గేట్‌ స్కోర్‌ను తమ నియామక ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. పీఎస్‌యూల్లో ఉద్యోగం అంటే.. ఆకర్షణీయ వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత ఉంటుంది. సీనియారిటీని బట్టి పదోన్నతులు పొందవచ్చు. రిటైర్‌మెంట్‌ తర్వాత పలు రకాల ప్రయోజనాలు సైతం అందుకోవచ్చు.

విదేశాల్లో చదువులు..
గేట్‌లో స్కోరుతో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రామాణిక గేట్‌ స్కోరు సాధించిన వారికి సింగపూర్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు సీట్లు కేటాయిస్తున్నాయి. అభ్యర్థి పర్సంటైల్‌ 90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎన్‌యూఎస్‌), నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)ల్లో అడ్మిషన్‌ పొందొచ్చు. సింగపూర్‌తోపాటు, వివిధ విదేశాలకు చెందిన అనేక ఇతర యూనివర్సిటీలు కూడా గేట్‌ స్కోరు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి.

కార్పొరేట్‌ రెడ్‌ కార్పెట్‌..
గేట్‌ స్కోర్‌తో ప్రవేశం పొంది.. టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్‌/ఎంఈ విజయవంతంగా పూర్తి చేసిన ప్రతిభావంతులకు కార్పొరేట్‌ రంగం రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకుతోంది. కార్పొరేట్‌ కంపెనీల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఉన్నత అవకాశాలను అందుకునే వీలుంది. అంతేకాకుండా దేశ విదేశీ టాప్‌ కంపెనీలు, ఎంఎన్‌సీలు గేట్‌ స్కోరుతో మాస్టర్స్‌ చేసినవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్, శాంసంగ్, టాటా, మారుతి, సిస్కో వంటి సంస్థలు ఇంజనీరింగ్‌ మాస్టర్స్‌ పూర్తిచేసిన అభ్యర్థులను పరిశోధన విభాగాల్లో నియమించుకుంటున్నాయి.

అధ్యాపక వృత్తికి మార్గం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీచింగ్‌ ప్రొఫెషనల్స్‌కు చాలా డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బోధనలో నిష్ణాతుల అవసరం పెరుగుతోంది. అనేక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులను క్యాంపస్‌ల నుంచే ఫ్యాకల్టీగా ఎంపిక చేసి తీసుకుంటున్నాయి. ఎంఈ/ఎంటెక్‌ చేసిన తర్వాత విశ్వవిద్యాలయాలు, ప్రముఖ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి అర్హతలు, అకడమిక్‌ ప్రతిభకు అనుగుణంగా లెక్చరర్‌ లేదా ప్రొఫెసర్‌గా నియమించుకుంటారు.

విదేశాల్లో ఉద్యోగాలు..
అమెరికా, ఐరోపా దేశాల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించాలని యువతరం కోరుకుంటోంది. అలాంటి వారు గేట్‌ ద్వారా ఎంటెక్‌/ఎంఈ పూర్తి చేస్తే.. విదేశీ అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఎంటెక్‌/ఎంఈ తర్వాత విదేశీ కంపెనీల్లో అవకాశాలు పొందవచ్చు. గేట్‌ స్కోరుతో పలు విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది.








#Tags