APPSC New Jobs Notifications System 2024 : ఇక‌పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల‌కు ఇలా నోటిఫికేష‌న్లు ఇవ్వాలి..! ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : జాబ్ క్యాలెండర్ విధానంలో ఆంధ‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే ఈ నివేదిక‌ ప్రభుత్వానికి అందజేయనుంది.

ఇలా నోటిఫికేష‌న్లు ఇవ్వాలి..
ఇక‌పై ఏటా మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను సిద్ధం చేయాలి. అలాగే జులై 31వ తేదీలోగా సంబంధిత కార్యదర్శులు ఆమోదం తెలపాలి. ఇక సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 15వ తేదీలోగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఇలా మంజూరైన ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు. అయితే.. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్‌ పార్టీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను వెల్లడించాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్‌లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్‌పై తెలిసే విధానాన్ని అనుసరించాలి.

☛➤ APPSC Group1 Mains Selection Ratio 1:100 : గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే.. లేదా..!
 
జాబ్‌ క్యాలెండర్‌ విధానంపై.. ఇంకా స్పష్టత రాలేదు..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) తరహాలోనే కమిషన్‌ సభ్యుల నియామకాలకు కచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జులై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఛైర్మన్‌గా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక, న్యాయశాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శులు జానకి, సునీత, ప్రదీప్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే ఈ జాబ్‌ క్యాలెండర్‌ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

ఆరు విభాగాలు ఉద్యోగాల‌ను..

ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌-ఎ, సివిల్‌ సర్వీసెస్‌-బి, స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్, ఇంజినీరింగ్‌ సర్వీసెస్, టీచింగ్‌ సర్వీసెస్, స్టేట్‌ జనరల్‌ సర్వీసెస్‌ కింద వర్గీకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్‌ 14న ఇచ్చిన జీవో 275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధనను తొలగించాలి. ఉద్యోగాల భర్తీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో తయారుచేసే వెబ్‌పోర్టల్‌ ద్వారా ఏపీపీఎస్సీకి అందాలి. డైరెక్ట్, క్యారీఫార్వర్డ్, అన్‌ ఫిల్డ్‌ విధానంలో ఖాళీలు, ఇతర వివరాలను సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలి. 

ఏపీపీఎస్సీ స‌భ్యుల‌కు ఈ అర్హ‌త‌లు ఉండాల్సిందే..

☛➤ UPSC and APPSC Ranker Bhanu Sri Success Story : చిన్న వ‌య‌స్సులోనే.. డిప్యూటీ కలెక్టర్.. ఐపీఎస్ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

యూపీఎస్సీలో మాదిరిగానే ఏపీపీఎస్సీ కమిషన్‌లోని నియమించే సభ్యులకూ ఉత్తమ విద్యార్హతలు ఉండాలి. ఛైర్మన్, సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటే.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సెర్చ్‌ కమిటీలు వేయాలి. దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలి.వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణుడి నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలి. ఏపీపీఎస్సీ కమిషన్‌ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి.., అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలోని అధికారితో పర్యవేక్షించాలి. ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దు.

#Tags