Intermediate Exams 2024: ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే

ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే
Intermediate Exams 2024: ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే

సత్తెనపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు కీలకంగా నిలిచే ఇంటర్మీడియట్‌ వార్షిక పబ్లిక్‌ పరీక్షల సందడి ప్రారంభమైంది. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు 20వ తేదీ నాటికి ముగిశాయి. మార్చి ఒకటి నుంచి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. నిఘా నీడలో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 9 ప్రభుత్వ కళాశాలలు, 69 ప్రైవేట్‌ కళాశాలలు, 2 ఎయిడెడ్‌ కళాశాలలు, 6 సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఒకటి రెసిడెన్షియల్‌, 14 మోడల్‌ పాఠశాలలు, 24 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మూడు హైస్కూల్‌ ప్లస్‌ ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 128 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో పరీక్ష కేంద్రాలుగా 48 కళాశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 31,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 29,628 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1,460 మంది ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు 14,232 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 760 మంది, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,597 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 561 మంది ఉన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన 08647–223355 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఇప్పటికే ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఆయా కళాశాలకు చేరుకోగా విద్యార్థులకు అందజేశారు. హాల్‌ టికెట్లు నేరుగా విద్యార్థులే డౌన్‌లోడ్‌ చేసే సదుపాయాన్ని ఇంటర్‌ బోర్డు కల్పించింది. ప్రిన్సిపల్‌ సంతకం లేకుండానే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌ సహాయంతో పరీక్ష రాయవచ్చు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాల ఎంపిక పూర్తయింది. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్ల కూడదు. డీవో, ఇన్విజిలేటర్లతో సహా ఏ ఒక్కరూ సెల్‌ఫోన్‌ వినియోగించడానికి వీల్లేదు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్‌లు, వెలుతురుతోపాటు ప్రథమ చికిత్స ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.

#Tags