Girl Escapes Child Marriage, Tops AP Inter Exams: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా, ఐపీఎస్ కావడమే లక్ష్యంగా..
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం.కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల.
బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు.
ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్‌ఎస్‌సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం.
నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది.
Also Read: పది, ఇంటర్ అర్హతతోనే సర్కారీ కొలువులెన్నో..!