Intermediate Public Exams 2024: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనంలో భాగంగా బోటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టు
ఏలూరు : ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బోటనీ, జువాలజీ, కామర్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 28 నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నెల 27 నుంచే ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కన్వీనర్ బీ.ప్రభాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు. మూల్యాంకన శిబిరం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని ప్రతి కళాశాల నుంచి బోటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల ఎగ్జామినర్లను ప్రిన్సిపాల్స్ తప్పనిసరిగా హాజరయ్యేలా రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఎగ్జామినర్లు బుధవారం ఉదయం 10 గంటలకు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. బోటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టులకు స్క్రూటినైజర్లు ఈ నెల 28న రిపోర్ట్ చేయాలని సూచించారు. రిపోర్ట్ చేయకపోతే రోజుకు రూ. 1000 చొప్పున జరిమానాగా విధించాలని బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.