వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు.

ముఖ్యాంశాలు:

  • 19వ శతాబ్దం నాటికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఐరోపా దేశాలు నియంత్రణ సాధించాయి.
  • వలస రాజ్యాల ప్రజలు జాతీయతా వాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం వంటి భావాలలో స్ఫూర్తి పొందారు.

చైనా:

  • చైనాను 20వ శతాబ్దం ఆరంభంలో మంచూ వంశ చక్రవర్తులు పరిపాలించారు.
  • 1911లో సన్-యోట్-సన్ మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
  • సన్-యెట్-సన్ ఆధునిక చైనా నిర్మాత. అతని కార్యక్రమాన్ని ‘మూడు సిద్ధాంతాలు’ అంటారు. (సన్,మిన్,చుయ్)
  • సన్ (జాతీయవాదం), మిన్ (ప్రజాస్వామ్యం), చుయి (సామ్యవాదం)
  • 1919 మే 4 న బీజింగ్‌లో పాత సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం మొదలైంది. దీనినే ‘మే నాలుగు ఉద్యమం’ అంటారు.
  • చైనాలో రెండు ప్రధాన పార్టీలు ఆవిర్భవించాయి. గుయోమిండాంగ్ (జాతీయ ప్రజాపార్టీ లేదా కెఎమ్‌టి), చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సిసిపి)
  • గుయో మిండాంగ్ పార్టీ సన్-యెట్-సన్ భావాలా ఆధారంగా ఏర్పడింది. కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా...‘నాలుగు ప్రధాన అవసరాలుగా’ గుర్తించారు.
  • సన్-యెట్-సన్ మరణం తర్వాత గుయోమిండాంగ్ నాయకుడిగా చియాంగ్ - కాయ్ - షేక్ ఎన్నికయ్యాడు.
  • చియాంగ్ సాంప్రదాయవాది. మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉంది. ‘పాతివ్రత్యం, రూపం, మాట, పని’ అన్న నాలుగు సుగుణాలపై వాళ్లు శ్రద్ధ పెట్టాలని అతడు భావించేవాడు.
  • గుయోమిండాంగ్ పార్టీ తన సంకుచిత సామాజిక తత్వం వలన రాజకీయ దూరదృష్టి లోపించడం వల్ల విఫలమైంది.
  • 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది.
  • రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం తర్వాత లెనిన్ 1918 మార్చిలో ‘కామిన్ టర్న్’ ని స్థాపించాడు. ప్రపంచం మొత్తంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
  • చైనా కమ్యూనిస్ట్ పార్టీ (ిసీసీపీ) నాయకుడు మావో జెడాంగ్ తన ఉద్యమానికి రైతాంగాన్ని ఆధారం చేసుకున్నాడు.
  • భూస్వామ్యాన్ని అంతం చేయడం కోసం చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ ‘రైతాంగసైన్యం’ నిర్మించాడు.
  • గుయోమిండాంగ్ పార్టీ దాడులను తప్పించుకోవడానకి జియాంక్సి పర్వతాలలో 1928 నుండి 1934 వరకు మావో బసచేశాడు.
  • 1934 - 35లో షాంక్సికి 6000 మైళ్ళ కష్ట భూయిష్టమైన ప్రయాణం (పాదయాత్ర) చేయడం జరిగింది. ఇదే ‘లాంగ్ మార్చ్’.
  • 1937-45 మధ్య చైనాపై జపాన్ దాడి చేసి చాలా బాగాలను ఆక్రమించింది.
  • ఈ సమయంలో గుయోమిండాంగ్, ిసీసీపీలు చేతులు కలిపాయి.
  • 1945 ఆగస్టులో జపాన్‌పై అమెరికా అణుబాంబు దాడి తర్వాత చైనాపై ఆధిపత్యంకోసం ఈ రెండు పార్టీలు పోటీపడి చివరకు సీసీపీ విజయం సాధించింది.
  • 1949లో చైనాలో ‘నూతన ప్రజాస్వామ్యం’ అన్న సిద్ధాంతం పై ఆధారపడి ‘చైనా ప్రజల గణతంత్రం’ (People's Republic of china)ఏర్పడింది.
  • 1950-51లో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
  • దీనిలో భాగంగా భూస్వాములు అవమానాలకు గురై మరణ శిక్షలకు గురయ్యారు.

వియత్నాం:-

  • 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఫ్రెంచి ప్రత్యక్ష పాలనలోకి వియత్నాం వచ్చింది.
  • వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచి ఆసక్తి కనబరచింది.
  • 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడవ అతిపెద్ద బియ్యం ఎగుమతి దారుగా ఎదిగింది.
  • వరి ఉత్పత్తి, రబ్బరు సాగు ప్రధానంగా ఫ్రెంచి వారు, కొంతమంది సంపన్న వియత్నామీయుల ఆధీనంలో ఉండేది.
  • దీని మూలంగా భూస్వామ్యం పెరిగి రైతాంగ జీవన ప్రమాణం పడిపోయింది.
  • గామ పెద్దలైన భూస్వాములు విధించే అధిక పన్నులు, అధిక కౌలు, అధిక వడ్డీ భారంలో రైతులు నలిగి పోయారు. వారు ఋణ బంధాలలో కూరుకు పోయారు.
  • విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాష, ఉన్నత విద్య అంతా ఫ్రెంచి భాషలో ఉండేది.
  • పాఠ్య పుస్తకాలు ఫ్రెంచి వాళ్లను పొగుడుతూ, వలస పాలనను సమర్థించేవి.
  • ఫెంచి వాళ్లు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు, విద్యార్థులు గుడ్డిగా అనుసరించకుండా ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవారు.
  • 1920 నాటికి ‘యువఅన్నాం’ అనే రాజకీయపార్టీ ఏర్పడింది. ఈ పార్టీ ఆధీనంలో ‘అన్నా మీన్ స్టూడెంట్’ అనే పత్రికను స్థాపించారు.
  • 1929-30 నాటి ఆర్థిక మాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనివల్ల గ్రామీణ స్థాయిలో రబ్బరు, బియ్యం ధరలు పడిపోయి ఋణ భారం పెరిగింది.
  • 1930 ఫిబ్రవరిలో హూచిమిన్’ వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ’ (వియత్నాకాంగ్ సాన్ డాంగ్) ను ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో ఇది ‘ఇండో -చైనీస్ కమ్యూనిస్టు పార్టీ’ గా మారింది.
  • 1940లో జపాన్ వియత్నాంను ఆక్రమించింది.
  • వియత్నాం స్వాతంత్య్ర సమితి - (వియత్‌నాం డాక్ లాప్ డాంగ్ మిన్) (వియత్ మిన్) - జపనీయుల ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడి 1945 సెప్టెంబర్‌లో హనాయ్‌ని తిరిగి స్వాధీనం చేసుకుంది.
  • హూచిమిన్ చైర్మన్‌గా వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రం ఏర్పడింది.
  • చక్రవర్తిని బావో దాయిని కీలు బొమ్మగా చేసి వియత్నాంపై తిరిగి నియంత్రణ సాధించడానికి ఫ్రెంచి వాళ్ళు ప్రయత్నించారు.
  • ఎనిమిది సం॥యుద్ధం తర్వాత 1954లో డీన్ బీన్‌ఫు వద్ద ఫ్రెంచి ఓడిపోయింది.
  • జెనివాలో జరిగిన శాంతి సమావేశంలో వియత్నాంను రెండుగా విభజించారు.
  • ఉత్తర వియత్నాంలో హూచిమిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్‌లు ఆధికారంలోకి వచ్చారు.
  • దక్షిణ వియత్నాంకు పురాతన చక్రవర్తి అధిపతి అయ్యాడు.
  • తదుపరి దక్షిణ వియత్నాంలో ఎన్‌గోడిన్ డీం నాయకత్వంలో నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది.
  • దీనికి వ్యతిరేకంగా ‘జాతీయ విముక్తి సమాఖ్య’ (ఎన్‌ఎల్‌ఎఫ్) పేరుతో ప్రజలు పోరాడారు.
  • ఉత్తర వియత్నాంలో 1954 నుండి హూచిమిన్ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి భూ సంస్కరణలు అమలు చేశారు.
  • ఎన్‌ఎల్‌ఎఫ్..రెండు వియత్నాంలను ఏకం చేయడానికి పోరాటం సాగింది.
  • కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతుందని భయపడిన అమెరికా వియత్నాంలో జోక్యం చేసుకొని ఉత్తర వియత్నాంపై దాడి చేసింది.
  • అమెరికా వియత్నాంపై ‘నాపాలం’ ‘ఏజెంట్ ఆరంజ్’ లాంటి విషపూరిత రసాయన బాంబూలను ప్రయోగించింది.
  • వియత్నాం గట్టిగా ఎదిరించడంతో అమెరికా వెనకడుగు వేసింది.
  • 1974లో జనవరిలో పారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు
  • 1974 ఏప్రిల్ 30 న రెండు వియాత్నాలు విలీనమయ్యాయి.

నైజీరియా:-

  • పస్తుతం నైజీరియాగా పిలుస్తున్న దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరిచారు.
  • నైజర్ నదీ వ్యవస్థ కింద ఉన్న హౌసా-ఫులాని, ఈబో తెగ, యొరుబా తెగలను కలిపి నైజీరియాను ఏర్పరచారు.
  • 16వ శతాబ్దం నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రం.
  • 19వ శతాబ్దంలో బానిసల వ్యాపారం నిషేధం.
  • తీర ప్రాంతాలపై 1861లో బ్రిటిష్ తన పాలనను ఏర్పాటు చేసింది.
  • బిటిష్ వారు జాత్యహం కారంలో ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు.
  • ‘విభజించు - పాలించు’ సిద్ధాంతం ఆధారంగా మూడు ప్రధాన గిరిజన తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సాహించారు.
  • 1923లో హెర్బర్ట్ మకాలే నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (ఎన్‌ఎన్‌డిపి) ని స్థాపించాడు. ఇది మొదటి రాజకీయ పార్టీ.
  • 1936లో ఎన్ నంది అజికివె - ‘నైజీరియా యువ ఉద్యమం’ (ఎన్‌వైఎం) ను స్థాపించాడు.
  • వీరిద్దరూ కలిసి 1944లో నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘం (ఎన్‌సీఎన్‌సీ)ఏర్పరచారు.
  • 1945లో అతివాద జాతీయవాద కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ‘జాతీయ సాధారణ సమ్మె’ నిర్వహించారు.
  • నైజీరియా జాతీయతా నాదం ముందు రెండు కర్తవ్యాలు....1)బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం 2) వివిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.
  • 1950 నాటికి మూడు ప్రాంతాలలో మూడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి.

ఉత్తర ప్రాంతంలో -ఉత్తర ప్రజల కాంగ్రెస్ (ఎన్‌పీసీ)
తూర్పు ప్రాంతంలో - నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం (ఎన్‌సీఎన్‌సీ)
పశ్చిమ ప్రాంతంలో - యాక్షన్ గ్రూపు (ఏజీ)

  • జాతీయ ఉద్యమ తీవ్రతను గుర్తించిన బ్రిటిష్ పాలకులు 1963 అక్టోబర్ 1 న స్వాతంత్య్రం ప్రకటించారు.
  • కాని అనతి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగి సైనిక పాలన ఏర్పడింది.
  • సుదీర్ఘ సైనిక పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
  • నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు.
  • చమురు బావులన్నీ విదేశీ బహుళజాతి కంపెనీల ఆధీనంలో ఉన్నాయి.
  • ఈ కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్చగా చమురును వెలికి తీయడం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి.
  • దీనివల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి.
  • పంటల, చేపల పెంపకం వంటివి దెబ్బతిన్నాయి.
  • తాగునీరు కూడా కలుషితమై ప్రజల ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపింది.
  • 1990ల కాలంలో దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
  • పముఖ మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ వాది అయిన ‘కెన్‌సారో వివా’ కు మరణ శిక్ష విధించారు.

4 మార్కుల ప్రశ్నలు - విషయావగాన - (AS1)
1. క్రింది వాటిని జత పరచండి.

ఎ) సన్-యెట్ - సెన్ --- దేశాన్ని సైనిక దేశం చేశాడు
బి)చియాంగ్ కాయ్‌షేక్ --- పర్యావరణ ఉద్యమం
సి)మావో జెడాంగ్ --- జాతీయతా వాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
డి) కెన్ సారో నివా --- రైతాంగ విప్లవం

జ:

ఎ) సన్-యెట్ - సెన్ --- జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
బి) చియాంగ్ కాయ్‌షేక్ --- దేశాన్ని సైనిక దేశం చేశాడు.
సి) మావో జెడాంగ్ --- రైతాంగ విప్లవం
డి) కెన్ సారో వివా --- పర్యావరణ ఉద్యమం
2. దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి?
జ:
చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులు:-
  1. ప్రాచీన చైనాలో మహిళలకు స్వేచ్ఛ లేకుండా ఉండేది. వారు పరాధీనులై ఉండేవారు.
  2. ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించడానికి వారి పాదాలు కట్టివేయడం జరిగేది.
  3. చియాంగ్ కాయ్‌షేక్ కాలంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉండేది.
  4. మహిళలకు అధిక పని గంటలు ఉంటూ తక్కువ వేతనాలు ఉండేవి.
  5. ‘పాతివ్రత్యం, రూపం, మాట, పని’ అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని భావించేవారు. వారు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలో కూడా నిర్ణయించేవారు.
  6. మావో కాలంలో గ్రామీణ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. కొత్త వివాహ చట్టం చేశాడు.
  7. 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు, వారి హక్కులకు, బహు భార్యత్వ నిషేధానికి కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది. దీని వల్ల మహిళలు పురుషులలో సమానంగా వివిధ రంగాలలో సమాన హోదా పొందారు.

రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకు చైనాలోని పరిస్థితులకు తేడాలు, పోలికలు :-
రష్యా

  1. రష్యాలు మహిళలు పురుషులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టేవారు.
  2. హక్కుల కోసం పోరాడటంలో పురుషుల కంటే ముందున్నారు.
  3. మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో ఉత్సవాలు జరిపి పురుషులకు ఎర్ర మెడ పట్టీలను బహుమతిగా ఇచ్చేవారు.
  4. ‘రొట్టె, శాంతి’ కోసం ఉద్యమించి దేశాన్ని ఉద్యమ పథంవైపు నడిపించేవారు.

జర్మనీ

  1. జర్మనీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉండేది.
  2. పురుషుల రంగంలో మహిళలు జోక్యం చేసుకోరాదు.
  3. హిట్లర్ అభిప్రాయంలో ‘ఈ లోకంలోకి మహిళ తెచ్చే ప్రతి సంతానము ఒక యుద్ధమే. తన ప్రజలకోసం మహిళ ఈ పోరు సలుపుతోంది.
  4. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మహిళల పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.
3. రాచరిక పాలనను పడదోసిన తర్వాత చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జ:
  1. చైనాలో పరిపాలన కొనసాగిస్తున్న ‘మంచూ’ సామ్రాజ్యాన్ని 1911లో సన్-యెట్-సెన్ కూల దోసి ‘గణతంత్ర రాజ్యాన్ని’ ఏర్పాటు చేశాడు.
  2. తర్వాత కాలంలో మావోజెడాంగ్ నాయకత్వంలో ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ’ అధ్వర్యంలో మరొక పాలన ఏర్పడింది.

వీటి మధ్య పోలికలు, తేడాలు క్రింద వివరించ బడ్డాయి.
పోలికలు:

  1. రెండు పాలనలు కూడా చైనాలో అనేక సంస్కరణలు అమలు చేశాయి.
  2. సన్-యెట్-సన్ ఆధ్వర్యంలోను, మావో ఆధ్వర్యంలోను మహిళలలకు రక్షణనిచ్చి వారి హక్కులపై అవగాహన కల్పించారు.
  3. భూస్వాముల భూములను స్వాధీనం చేసుకొని భూమిలేని వారికి పంచి భూసంస్కరణలను సమర్థంగా అమలు చేశారు.

తేడాలు:

గణతంత్య్ర రాజ్యం

చైనా కమ్యూనిస్టు పార్టీ

1. సామ్యవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం పునాదులపై నిర్మించబడింది. 1. భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం వ్యతిరేకతతో నిర్మించబడింది.
2. సామాజిక మూలాలు పట్టణాలలో ఉన్నాయి. 2. సామాజిక మూలాలు గ్రామాలలో ఉన్నాయి.
3. చియాంగ్ కాయ్‌షేక్ కాలంలో మహిళలలను ఇంటికి పరిమితం చేయడం జరిగింది. 3. మహిళలలకు అన్ని రకాలు స్వేచ్ఛలు, హక్కులు కల్పించారు.
4.సంకుచిత సామాజిక తతత్వం వలన దేశంలో ఏకత్వం సాధించలేక పోయింది. 4. అన్ని వర్గాలను కులుపుకొని పోవడం వల్ల ఏకత్వాన్ని సాధించారు.

4. చైనా, వియత్నాం, నైజీరియా దేశాలు ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినవే. అందులో పద్ధతులు మార్చడానికి ఈ దేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి?
జ:
చైనా:
  1. చైనాలో సన్-యెట్-సన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతాంగాన్ని పట్టించుకోలేదు.
  2. దీని వల్ల నేలలు నిస్సారం కావడం, అడవులను నరికివేయడం, వరదల వలన జీవావరణం దెబ్బ తినడం జరిగాయి.
  3. మావో జెడాంగ్ కాలంలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
  4. భూసంస్కరణలు అమలు చేసి ‘‘పనిబృందాలు’ ఏర్పరచి వ్యవసాయాన్ని ప్రోత్సాహించారు.

వియత్నాం:

  1. ఫ్రెంచి వారి పాలనలో వియత్నాంను ‘వరి’ ని ఎగుమతి చేసే దేశంగా చేయాలని భావించి దాన్ని సాధించారు.
  2. ఇందుకోసం సాగునీటి సదుపాయాలను మెరుగు పరచారు. భూస్వాములను ప్రోత్సహించారు.
  3. బీడు భూముల నుంచి నీటినితోడి కాలువల నిర్మాణం చేపట్టారు.
  4. వరి, రబ్బరు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకార్యాలు కల్పించారు.
  5. ఈ చర్యల మూలంగా 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో వరిని ఎగుమతి చేసే దేశాల్లో 3 వ స్థానానికి చేరుకుంది.

నైజీరియా:

  1. నైజీరియాలో బానిసల వ్యాపారాన్ని నిషేధించిన తర్వాత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  2. కోకో, పామాయిల్ వంటి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సాహించారు.

5. పైన చర్చించిన దేశాలలో (చైనా, వియత్నాం, నైజీరియా) పరిశ్రమలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ పద్ధతులు మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి. పోల్చటానికి ఒక పట్టికను తయారు చేయండి.

చైనా వియత్నాం నైజీరియా
సన్-యెట్-సన్ కాలం b0 1. పరిశ్రమల మూలాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉండేవి. 2. పారిశ్రామిక ప్రగతి పరిమితంగాను, నిదానంగాను ఉంది. 3. షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. 4. ఈ పరిశ్రమలన్నీ శ్రామిక వర్గం చేతిలో ఉండేవి. b చియాంగ్ కాయ్‌షేక్ కాలం b0 5. ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సాహించడానికి, కార్మిక సంఘాలను అణచివేయడానికి పూనుకున్నాడు. bమావోజెడాగ్ కాలం b0 6. మావో అధికారంలోకి వచ్చాక తిరిగి కార్మిక సంఘాలకు ప్రాధాన్యత లభించింది. పరిశ్రమలను జాతీయం చేయడం జరిగింది. 1. ఫ్రెంచి పాలనలో వియత్నాంలో పారిశ్రామిక ప్రగతికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 2. వియత్నాంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేశారు. 3. బియ్యం మిల్లులు, రబ్బరు తయారీ పరిశ్రమలు మాత్రమే స్థాపించబడ్డాయి. 4. పంటలు, వాణిజ్య సరుకుల రవాణా కోసం రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చేశారు. 1. నైజీరియా ప్రధాన వనరు చమురు. 2. 1950లో చమురును కనుగొన్న తర్వాత వివిధ బహుళజాతి కంపెనీలు వెలికి తీసే హక్కులను పొందాయి. 3. ఇవి చమురును వెలికి తీసి తమ లాభాల్లో అప్పటికి సైనిక ప్రభుత్వానికి వాటా ఇచ్చాయి. 4. సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పడ్డాయి. 5. చమురు వెలికితీత వల్ల జరిగిన పర్యావరణ కాలుష్యం వల్ల భూమి, నీళ్ళు కలుషితమై అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి.

6. భారత దేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉంది?
జ:
భారతదేశంలో జాతీయ ఉద్యమం:

  1. భారతదేశ జాతీయోద్యమము సుధీర్ఘంగా కొనసాగింది. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
  2. 1757లో ప్లాసీ యుద్ధ ఫలితంగా బ్రిటిష్ పాలన మొదలైంది.
  3. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత 1857లో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా మొదటి సారి తిరుగు బాటు జరిగింది.
  4. బ్రిటిష్ వారు అనుసరించిన అనేక విధానాలు భారతీయులు ఏకం కావడానికి దోహదం చేశాయి.
  5. ఆంగ్ల విద్యను నేర్చిన భారతీయులు స్వేచ్ఛ, సమానత్వము, ప్రజాస్వామ్యం వంటి భావాలను తెలుసుకొని జాతీయ స్ఫూర్తిని పెంపొందించారు.
  6. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం మొ॥సంస్థలు స్థాపించి సంస్కరణ ఉద్యమాలు న డిపారు. ఇవి జాతీయ ఉద్యమం బలపడటానికి దోహదం చేశాయి.
  7. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది.

నైజీరియా:

  1. నైజీరియా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు.
  2. మూడు ప్రధానమైన తెలగు హౌసా-ఫులాని, ఈబో, యొరుబాలు ఉన్నాయి.
  3. ఇక్కడ ప్రధాన వనరు చమురు.
  4. ఇక్కడ కూడా బ్రిటిష్ వారు ‘విభజించు-పాలించు’ విధానాన్ని అనుసరించారు.
  5. భారతదేశ జాతీయ నాయకుడు గాంధీజీ కాగా, నైజీరియా జాతీయ నాయకుడు ఎన్ నంది అజికివె.
  6. 1963 అక్టోబర్ 1 న స్వాతంత్య్రం వచ్చింది.

 

భారతదేశంలో బలమైన జాతీయ ఉద్యమానికి కారణం:నైజీరియాతో పోలిస్తే భారతదేశంలో జాతీయ ఉద్యమం బలంగా ఉంది. ఎందుకుంటే విద్యావంతులు, ప్రపంచం మెచ్చే మేధావులు దానికి నాయకత్వం వహించారు. భారతీయ సాంస్కృతిక పునాది కూడా చాలా బలమైనది.

7. స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లలో పోలికలు తేడాలు ఏమిటి?
స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు:-

 

  1. 1963 అక్టోబరి 1 న నైజీరియా స్వాతంత్య్రం పొందింది. కాని ప్రజాస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేక పోయింది.
  2. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పౌర యుద్ధం (అంతర యుద్ధం) చెలరేగింది.
  3. తద్వారా నైజీరియాలో సైనిక పాలన ఏర్పడి ఉత్తర ప్రాంత ఆధిపత్యధోరణిని కొనసాగించింది.
  4. సైనిక పాలనలో అవినీతి, విస్తరించింది. మానవహక్కుల ఉల్లంఘన కొనసాగింది.
  5. అవినీతి పాలకులకు బహుళ జాతి కంపెనీలు మద్దతు ఇచ్చాయి.
  6. చమురును వెలికి తీసే ప్రయత్నంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేకపోవడం వల్ల అనేక పర్యావరణ సమస్యలను ఎదుర్కొన్నారు.

 

భారదేశంఎదుర్కొన్న సవాళ్లలో పోలికలు:

 

భారతదేశం నైజీరియా
1. మత ఘర్షణలు చెలరేగాయి. 1. పౌరయుద్ధం చెలరేగింది.
2. అవినీతి పెరిగిపోయింది. 2. అవినీతి పెరిగింది.
3. అడవుల నరివేత వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. 3. చమురు వెలికితీత వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి.
4.నిరుద్యోగము, పేదరికము విస్తరించాయి. 4. నిరుద్యోగము, పేదరికము పెరిగింది.

తేడాలు:

భారతదేశం నైజీరియా
1. ప్రజాస్వామ్యం ఏర్పడి విజయవంతంగా కొనసాగింది. 1. సైనిక పాలన ఏర్పడింది.
2. 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 2. రాజ్యాంగ తయారీ జరగలేదు.
3. ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. 3. మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా జరిగింది.
4. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వము పొందారు. 4. ప్రజలు సైనిక పాలన నిర్భంధాలను ఎదుర్కొన్నారు.
5. దేశం రెండుగా విడిపోయింది. 5. దేశ విభజన జరగలేదు.

8. భారతదేశం, వియత్నాంలాగ స్వాతంత్య్రం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి.
జ:

  1. 1861లో నైజీరియా తీర ప్రాంతాలపై బ్రిటిష్ తన పాలనను ఏర్పాటు చేసింది.
  2. ఇక్కడ బ్రిటిష్ వారు విభజించు-పాలించు సిద్ధాంతాన్ని పాటించి పరిపాలించారు.
  3. వీరి పాలన నుంచి విముక్తి పొందడానికి 1923లో మొదటి రాజకీయ పార్టీ నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ(ఎన్‌ఎన్‌డీపీ) ఏర్పడింది.
  4. 1936లో ‘నైజీరియా యువ ఉద్యమం’’ (ఎన్‌వైఎం) ఏర్పడింది.
  5. 1944లో నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘం (ఎన్‌సీఎన్‌సీ) ఏర్పడింది.
  6. వీరి ఆధ్వర్యంలో జరిగిన కొద్ది పాటి పోరాటం ద్వారా నైజీరియా 1963 అక్టోబర్ 1న స్వాతంత్య్రం పొందింది.

అయితే భారతదేశం, వియత్నాంల లాగ స్వాతంత్య్రం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి క్రింది కారణాలు తెలుపవచ్చు.

  1. భారతదేశము సువిశాలమైన దేశం, అనేక మతాలు, భాషలు, కులాలు సంస్కృతులు ఉన్నాయి. వీరందరి మధ్య ఐక్యమత్యం సాధించడం కష్టమైంది.
  2. భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించిన రాజుల మధ్య కూడా ఐకమత్యం లేదు. 200 సం॥సుదీర్ఘ పోరాటం తర్వాత స్వాతంత్య్రం వచ్చింది.
  3. వియత్నాంను రెండు దేశాలు (ఫ్రెంచి, జపాను) పరిపాలించాయి.
  4. వాటి నుంచి స్వాతంత్య్రం సాధించుకోవడానకి చాలా కష్టపడాల్సి వచ్చింది.
  5. మరొక వైపు అమెరికాలో యుద్ధం చేయాల్సి వచ్చింది.
  6. వీటి తో పోల్చుకుంటే నైజీరియన్లు పడిన శ్రమ చాలా తక్కువే.
  7. దీని కొరకు వారు రెండు వ్యూహాలు అనుసరించారు. ఎ. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం. బి. వివిధ తెగాల మధ్య ఐకమత్యం సాధించడం.
  8. పరస్పరం ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐకమత్యం సాధించడంతో స్వాతంత్య్రం పొందడం సులభమైంది.

9. పైన చర్చించిన దేశాల (చైనా, వియత్నాం, నైజీరియా) లోని జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య పాత్ర ఏమిటి?
జ:
చైనా:

  1. జాతీయోద్యమ కాలంలో చైనాలో విద్య, అక్షరాస్యతలను వ్యాపింప చేయడానికి పెద్ద ఎత్తున వయోజన రైతాంగ పాఠశాలలను ప్రారంభించారు.
  2. గ్రామాల్లోని చిన్న పిల్లలకు, పెద్ద వాళ్ళకు ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు.
  3. అందరికీ ప్రాథమిక విద్యను అందించడంలో సాధించిన విజయాలు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి.

వియత్నాం:

  1. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన వియత్నామీ భాషలో ఉండేది.ఉన్నత విద్య మొత్తం ఫ్రెంచి భాషలో ఉండేది.
  2. పాఠ్య పుస్తకాలు ఫ్రెంచి వాళ్ళను పొగుడుతూ వలస పాలనను సమర్థించేవి.
  3. ఫ్రెంచి వాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు, విద్యార్థులు గుడ్డిగా అనుసరించలేదు
  4. టీచర్లు పాఠాలలో ఉన్న దానిని మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించే వారు.
  5. ఈ ప్రయత్నాల వల్ల ఫ్రెంచి ప్రభుత్వ నిర్ణయాలను విద్యార్థులు ప్రతిఘటించారు.

నైజీరియా:

  1. వలస పాలకుల విధానాల వల్ల దక్షిణ ప్రాంతంలో ఆధునిక విద్య లభించగా ఉత్తర భాగంలో పూర్వ సాంప్రదాయాలు కొనసాగాయి.
  2. పాశ్చాత్య విద్య పొందిన కొంత మంది ‘ఉమ్మడి నైజీరియా దేశం’ అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు.

10. ఈ దేశాల స్వాతంత్య్ర పోరాటాలలో పాలకులపై యుద్ధాలు చేశారు. వాటి ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి.
జ:
చైనా:

  1. చైనాలో స్వాతంత్య్ర పోరాటం కోసం ప్రధానంగా రెండు పార్టీలు కృషి చేశాయి. గయోమిండాంగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ.
  2. మావోజెడాంగ్ భూస్వామ్యాన్ని అంతం చేయడానికి రైతాంగ సైన్యాన్ని ఏర్పరచాడు.
  3. అధికార గయోమిండాంగ్, మావోనాయకత్వంలోని సిసిపి మధ్య తీవ్ర పోరాటం జరిగింది.
  4. 1934-35లో మావో 6000 మైళ్ళ ‘లాంగ్‌మార్చ్’ చేశాడు.
  5. అయితే 1937-45 మధ్యకాలంలో జపాన్ చైనాపై దండెత్తినపుడు ఈ పార్టీలు చేతులు కలిపి ధీటుగా ఎదుర్కొన్నాయి.
  6. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత చైనాపైప పట్టుకొరకు ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. చివరికి చైనాపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించి 1949లో ‘చైనా ప్రజల గణతంత్రం’ ఏర్పరచింది.

వియత్నాం:

  1. స్వాతంత్య్ర పోరాటంలో వియత్నాం మూడు దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది.
  2. మొదటి వలస పాలకులైన ఫ్రెంచి వారితో సుదీర్ఘమైన జాతీయ పోరాటం చేశారు.
  3. 1940లో జపాన్ వియత్నాంను ఆక్రమించడంతో జపాన్ కి వ్యతిరేకంగా పోరాడ వలసి వచ్చింది.
  4. వియత్నాంలో కమ్యూనిస్టుల ప్రభావాన్ని ఎదుర్కొవడానికి అమెరికా దాడి చేసింది.
  5. అమెరికా వియత్నాంపై విషపూరితమైన ‘ఏజెంట్ ఆరంజ్’ లాంటి విష రసాయనాలు ప్రయోగించింది.
  6. అమెరికా దాడిని వియత్నామీయులు ధీటుగా ఎదుర్కోవడంలో అమెరికా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది. 1974 లో జరిగిన సంధి ద్వారా యుద్ధం ముగిసింది.

నైజీరియా:

  1. నైజీరియాలో ఎన్ నంది అజికివె నాయకత్వంలో నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం(ఎన్‌సీఎన్‌సీ) ఏర్పడి జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది.
  2. వీరు తీవ్ర యుద్ధం ఏమీ చేయలేదు కొద్దిపాటి పోరాటంతోనే 1963 అక్టోబర్ 1 న స్వాతంత్య్రం పొందారు.
  3. కాని తర్వాత నైజీరియాలో పౌర యుద్ధం చెలరేగి సైనిక పాలన ఏర్పడింది.
  4. దీనికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిగి చివరకు 1999లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
  5. చమురు వెలికి తీతలో జరిగే పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా కూడా సుదీర్ఘ పోరాటం చేశారు.
  6. ఈ పోరాటంలో చురుకుగా పాల్గొన్న పర్యావరణ వాది, మానవా హక్కుల వేత్త కెన్‌సారో వివాకు మిలటరీ ప్రభుత్వం మరణ శిక్ష వేసింది.

ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వాఖ్యానించడం:-
11. ఈ క్రింది అంశాన్ని చదివి నీ అభిప్రాయన్ని తెలియజేయుము.
ఏజెంట్ ఆరెంజ్ : అత్యంత విషపదార్థము ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం. నారింజ పట్టీ ఉన్న డ్రమ్ములలో నిల్వ చేయడం వల్ల దానికి ఆ పేరు వచిచంది. 1961-1971 మధ్య కాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయనాన్ని చల్లాయి. అడవులు, పొలాలను నిర్మూలించడం ద్వారా ప్రజలు దాక్కోవడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని తేలికగా చంపొచ్చన్నది అమెరికా ప్రణాళిక, దేశంలో 14 శాతం సాగు భూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితం అయింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ నాటికి కూడా ప్రజలపై దాని ప్రభావం ఉంది. ఏజెంట్ ఆరెంజ్‌లోని రసాయనిక అంశమైన డై ఆక్సిన్ పిల్లలలో మెదడు దెబ్బతినడానికి, కాన్సర్‌కి కారకం. ఈ మందు పిచికారీ చేసిన ప్రాంతాల్లో పిల్లలలో అవయవ లోపాలు అధికంగా ఉండటానికి ఈ విషమే కారణమని ఒక అధ్యయనం వెల్లడి చేసింది.
జ:

  1. వియత్నాంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గించడానికి వారిని లొంగ దీసుకోవడానికి అమెరికా వియత్నాంపై దాడులకు తెగబడింది.
  2. వేలాది అమెరికా సైనికులు శక్తివంతమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, విషపూరితమైన రసాయనాలతో దాడి చేశారు.
  3. వియత్నాంలో దట్టమైన అడవులలో దాక్కోని వియత్నాం సైనికులు అమెరికా దాడులను తిప్పికొట్టారు. వియత్నాం వారి ఎదురుదాడిని అణచివేయడం అమెరికాకు సవాలుగా నిలిచింది.
  4. ఈ పరిస్థితుల్లో వియత్నాంలోని అడవులను నాశనం చేయడమే లక్ష్యంగా అనేక విష రసాయనాలను ప్రయోగించింది. అందులో ఒకటి ఏజెంట్ ఆరంజ్.
  5. 1961-71 మధ్య అమెరికా కార్గో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయనాన్ని చల్లాయి.
  6. దీని ప్రభావం వల్ల వియత్నాంలోని అడవులు నాశనమయ్యాయి. 14% సాగుభూమి బీడు భూమిగా మారింది.
  7. పిల్లల్లో మెదడు దెబ్బతిని, కాన్సర్‌కి కారణమైంది. పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడ్డాయి.
  8. ప్రపంచంలో మానవ హక్కులను కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించాలని నీతులు చెప్పే అమెరికా వాటిని నాశనం చేసే ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటు.

12. క్రింది అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి.
చియాంగ్ సాంప్రదాయవాది. మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని, ‘పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించేవాడు. ఆడ వాళ్లు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలన్నది కూడా సిఫారసు చెయ్యసాగారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మికసంఘాలను అణచి వెయ్యటానికి కూడా అతను పూనుకున్నాడు. గుయోమిండాంగ్ పార్టీ తన సంకుచిత సామాజిక తత్వం వలన, రాజకీయ దూరదృష్టి లోపించడం వలన దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలమైంది. సన్-యెట్-సన్ కార్యక్రమంలోని ప్రధాన అంశమైన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అన్న వాటిని అమలు చేయనే లేదు. పెరుగుతున్న సామాజిక అసమానతలను, రైతాంగాన్నీ పార్టీ పట్టించుకోలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి బదులు సైన్యంతో శాంతి భద్రతలను కల్పించడానికి ప్రయత్నించారు.
జ:

  1. సన్-యెట్-సన్ మరణించిన తర్వాత చైనాలోని గుయోమిండాంగ్ పార్టీకి చియాంగ్ కాయ్‌షేక్ నాయకుడు అయ్యాడు.
  2. దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించాడు.
  3. ఈయన సాంప్రదాయ వాది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడు.
  4. మహిళలు ఇంటికే పరిమితమై ఉండాలని ఇతని అభిప్రాయం
  5. మహిళలు ‘పాతివ్రత్యం, రూపం, మాట, పని’ అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని భావించాడు.
  6. మరొవైపు ఫ్యాక్టరీ యజమానులకు సహాయకంగా కార్మిక సంఘాలను అణచి వేసే ప్రయత్నం చేశాడు.
  7. పెరుగుతున్న సామాజిక అసమానతలను, రైతాంగాన్నీ పట్టించుకోలేదు.
  8. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారిని శాంతి భద్రతల పేరుతో సైన్యంతో అణచి వేయడానికి ప్రయత్నించాడు.

ఈ చర్యల మూలంగా దేశం మొత్తంలో వ్యతిరేకత వచ్చి చైనాలో కమ్యూనిస్టు పార్టీ బలం పుంజుకునేలా జరిగింది.

13. ప్రంచ పటంలో క్రింది వాటిని గుర్తించుము.

1. చైనా 2. వియత్నాం 3.నైజీరియా 4. జపాన్ 5.ఫ్రెంచి 6.బ్రిటిష్ 7.పారిస్ 8.లండన్ 9.బీజింగ్ 10.సైగాన్ 11.నైజర్.


--------ప్రపంచ పటం మ్యాప్----------

2 మార్కుల ప్రశ్నలు
1. చైనాలో గణతంత్రం ఏర్పాటులో సన్-యెట్-సన్ పాత్ర ఏమిటి?
జ:

  1. మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి సన్-యెట్-సన్ తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాని ఏర్పాటు చేశాడు.
  2. అతని కార్యక్రమాన్ని ‘మూడు సిద్ధాంతాలు’ అంటారు.
  3. సన్ (జాతీయవాదం) - విదేశీ సామ్రజ్యవాద శక్తులను పారద్రోలడం.
  4. మిన్ (ప్రజాస్వామ్యం) - ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం.
  5. చుయి (సామ్యవాదం) - పరిశ్రమలపై నియంత్రణ సాధించడం. భూమిలేని రైతాంగానికి భూమి పంచడం.

ఈ విధానాల ద్వారా ప్రజలను ఆకర్షించి చైనాలో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
2. ‘మే నాలుగు ఉద్యమం’ గురించి వ్రాయండి.
జ:
మే నాలుగు ఉద్యమం:-

  1. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వర్సయిల్స్ సంధి షరతులను నిరసిస్తూ 1919 మే 4 న చైనా రాజధాని బీజింగ్‌లో నిరసన చేపట్టారు.
  2. చైనా బ్రిటిష్ పక్షాన ఉన్నప్పటికీ జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి చైనాకి రాలేదు.
  3. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి అసమానతలు రూపుమాపాలని విప్లవకారులు కోరారు.
  4. మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు కట్టి వేయడం వంటి వాటిని వ్యతిరేకించారు.

ఈ డిమాండ్ల సాధన కోసం జరిగిన ఉద్యమమే చైనాలో ‘మే నాలుగు ఉద్యమం’ గా ప్రసిద్ధి చెందింది.
3. మావో జెడాంగ్ చైనాలో ప్రజాబలాన్ని ఎలా సంపాదించాడు?
జ:
మావో జెడాంగ్:

  • 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది.
  • అంతకు ముందు 1917లో రష్యా విప్లవం విజయాలు దీనికి దోహదపడ్డాయి.
  • అయితే చైనాలో మావో పట్టణ ప్రాంత కార్మికులను కాకుండా గ్రామీణ ప్రాంతంలోని రైతాంగాన్ని తన విప్లవ కార్యక్రమానికి ఎన్నుకున్నాడు.
  • భూస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు.
  • భూమి లేని రైతులు లక్షలాదిగా ఉద్యమంలో పాల్గొన్నారు.
  • మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు గ్రామీణ మహిళా సంఘాలను ఏర్పరచాడు.
  • 1934-35లో ‘లాంగ్ మార్చ్’ గా ప్రఖ్యాతి గాంచిన 6000 మైళ్ళు పాదయాత్ర చేపట్టాడు.
  • ఈ చర్యల మూలంగా చైనా ప్రజల అభిమానాన్ని చూరగొని 1949లో చైనాలో చైనా ప్రజల గణతంత్రాన్ని ఏర్పాటు చేశాడు.

4. వియత్నాంలో హూచిమిన్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం గురించి తెలపండి.
జ:
హూచిమిన్:

  1. వియత్నాంలో హూచిమిన్ ప్రముఖ జాతీయ పోరాట నాయకుడు.
  2. 1930 ఫిబ్రవరిలో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ (వియత్నాం కాంగ్ సాంగ్ డాంగ్) ని స్థాపించాడు.
  3. 1945లో జపనీయుల ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడి హనాయ్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
  4. వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రం ఏర్పడి దానికి హూచిమిన్ చైర్మన్ అయ్యాడు.
  5. వియత్నాం రెండుగా విభజించిన తర్వాత ఉత్తర వియత్నాంలో హూచిమిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది.

5. నైజరియాలో చమురు, పర్యావరణం సమ్యను తెలపండి.
జ:
నైజీరియాలో చమురు, పర్యావరణ సమస్య:

  1. నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికి తీసేందుకు డచ్‌షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళ జాతి కంపెనీలు హక్కులు పొందాయి.
  2. ఈ కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్ఛగా చమురును వెలికి తీయడం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి.
  3. దీని వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించి పోయాయి.
  4. తాగునీళ్లు కూడా కలుషితం కావడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది.
  5. దీనికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ వాది కెన్ సారో వివా కు మరణశిక్ష విధించారు.

 

6. క్రింది కాల పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.

 

1911 చైనాలో గణతంత్ర రాజ్యం
1919 మే నాలుగు ఉద్యమం
1921 చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం.
1934-35 లాంగ్ మార్చ్
1949 చైనా ప్రజల గణతంత్రం ఏర్పాటు.
  1. 1911లో చైనాలో గణతంత్ర రాజ్యం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది?
  2. మే నాలుగు ఉద్యమం’ ఏ సం॥జరిగింది.
  3. 1934-35లో ‘లాంగ్ మార్చ్’ ఎవరి నాయకత్వంలో జరిగింది.
  4. చైనా చరిత్రలో 1949 సం॥యొక్క ప్రాధాన్యత ఏమిటి?

 

జ:1. సన్-యెట్-సెన్
2. 1919
3.మావో జెడాంగ్
4.చైనా ప్రజల గణతంత్రం ఏర్పాటు.

1 మార్కు ప్రశ్నలు
1. 20 వ శతాబ్దం ప్రారంభంలో చైనాను పాలించిన రాజవంశం ఏది? దానిని ఎవరు కూలదోసారు?
జ:

1. 20వ శతాబ్దం ప్రారంభంలో చైనాను మంచూ వంశం పరిపాలించింది.
2. సన్-యెట్ -సన్ దానిని కూల దోసాడు.

2. ‘మే నాలుగు ఉద్యమం’ ఎందుకు జరిగింది?
జ:
వర్సయిల్స్ సంధిలో చైనాకు జరిగిన అన్యాయానికి నిరసనగా 1919మే 4న బీజింగ్‌లో నిరసన మొదలైంది. ఇదే ‘మే నాలుగు ఉద్యమం’ గా పేరు పొందింది.

3.సన్-యెట్-సెన్ సిద్ధాంతాలు ఏవి?
జ:
సన్-యెట్-సెన్ ‘మూడు సిద్ధాంతాలు’ అనుసరించాడు.
1. సన్ - జాతీయవాదం
2. మిన్ - ప్రజాస్వామ్యం
3. చుయ్ - సామ్యవాదం

4. గుయో మిండాంగ్ పార్టీ ఉద్దేశంలో ప్రజలకు కావలసిన ప్రధాన అవసరాలు ఏవి?
జ:
గుయో మిండాంగ్ పార్టీ ఉద్దేశంలో కూడూ, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి నాలుగు ప్రధాన అవసరాలు.

5.‘కొమిన్‌టర్న్’ అనగా నేమి?
జ:
కొమిన్ టర్న్:
1. రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నేత లెనిన్ నాయకత్వంలో 1918 మార్చిలో కొమిన్‌టర్న్ ఏర్పడింది.
2. దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీని ఉద్దేశం.

6. వియత్నాం ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి?
జ:
వియత్నాం ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు వరి, రబ్బరు.

7.‘ఏజెంట్ ఆరంజ్’ అనగా నేమి?
జ: ‘
ఏజెంట్ ఆరంజ్’:
1. 1961-71 అమెరికా వియత్నాంపై ప్రయోగించిన విషపూరితమైన రసాయన పదార్థమే ‘ఏజెంట్ ఆరంజ్’
2. నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చేయటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.

8. నైజీరియాలో స్థాపించబడిన ఏవైనా రెండు రాజకీయ పార్టీల పేర్లు తెలపండి.
జ:
1. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (ఎన్‌ఎన్‌డీపీ)
2. నైజీరియా యువ ఉద్యమం (ఎన్‌వైఎం)

ఈ క్రింది కాల పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.

 

 

1920 వియత్నాంలో ‘యువఅన్నాం’ పార్టీ ఏర్పాటు
1930 వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు
1940 వియత్నాంపై జపాన్ ఆక్రమణ
1945 వియత్ మిన్ అధికారంలోకి రావడం
1954 డీన్ బీన్ ఫు వద్ద ఫ్రెంచ్ ఓటమి
1974 పారిస్‌లో శాంతి ఒప్పందం
1975 సైగాన్‌లో అధ్యక్ష భవనం స్వాధీనం

 


9. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? ఎవరు ఏర్పరచారు?
జ:
1930, హూచిమిన్

10. వియత్నాం అధ్యక్ష భవనం ఎక్కడ ఉంది?
జ:
సైగాన్

బహుళైచ్ఛిక ప్రశ్నలు (1/2 మార్కు)
1. 1919 మే 4న వర్సయిల్స్ సంధికి నిర్ణయాలను నిరసిస్తూ ఎక్కడ ఉద్యమం మొదలైంది ( )

ఎ)షాంఘై
బి)బీజింగ్
సి)బెర్లిన్
డి)సైగాన్
2. చైనాలో జాతీయ ప్రజాపార్టిగా పిలువ బడిన పార్టీ.... ( )
ఎ) గుయోమిండాంగ్
బి)చైనా కమ్యూనిస్ట్ పార్టీ
సి)చైనా గణతంత్ర పార్టీ
డి)సన్-మిన్-చుయ్
3. పెకింగ్ విశ్వ విద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ( )
ఎ)1900
బి)1902
సి)1904
సి)1919
4. చైనాపై జపాన్ దండెత్తిన సంవత్సరం ( )
ఎ)1920
బి)1921
సి)1930
డి)1937
5. చైనాలో ‘లాంగ్ మార్చ్’ ను నిర్వహించింది ఎవరు? ( )
ఎ)చౌ ఎన్‌లై
బి)సన్-యెట్-సెన్
సి)మావోజెడాంగ్
సి)చియాంగ్ కాయ్‌షేక్
6.1931 నాటికి ప్రపంచంలో మూడ అతిపెద్ద బియ్యం ఎగుమతి వారుగా ఎదిగిన దేశం ఏది? ( )
ఎ) వియత్నాం
బి)ఫ్రాన్స్
సి) చైనా
డి)నైజీరియా
7. వియత్నాంలో ఉన్నత విద్య ఏ భాషలో భోదించే వారు? ( )
ఎ)వియత్నామీ
బి)ఇంగ్లీషు
సి)ఫ్రెంచ్
డి)రష్యన్
8. 1940లో వియత్నాంను ఆక్రమించిన దేశం ఏది? ( )
ఎ) అమెరికా
బి)జపాన్
సి)ఫ్రెంచ్
డి)జర్మనీ
9. ‘అన్నామీన్ స్టూడెంట్’ అనేది ఏమిటి? ( )
ఎ) రాజకీయ పార్టీ
బి)విద్యార్థి సంఘం
సి) యువజన సంఘం
డి) పత్రిక
10. ఎవరి నియంతృత్వ పానకు వ్యతిరేకంగా వియత్నాంలో ‘జాతీయ విముక్తి సమాఖ్య (ఎన్‌ఎల్‌ఎఫ్) ఏర్పడింది.? ( )
ఎ) హూచిమిన్
బి)ఎన్ గుయెన్
సి)ఎన్ గో డిన్ డీం
డి) వియత్ మిన్
11. ఇది నైజీరియా దేసంలో తెగ కాదు..... ( )
ఎ) హౌసా-ఫులాని
బి)ఈబో
సి)కామెరూన్
డి)యెరూబా
12.నైజీరియా తీర ప్రాంతాలపై బ్రిటన్ తన పాలనను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ( )
ఎ)1821
బి)1850
సి)1861
డి)1890
13. నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? ( )
ఎ)1949
బి)1950
సి)1952
డి)1948
14. 1950 లో నైజీరియాలో ఈ ఖనిజం కనుగొన్నారు ( )
ఎ) బంగారం
బి)వజ్రాలు
సి)బొగ్గు
డి)చమురు
15. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణ వాది ....( )
ఎ) వియత్‌మిన్
బి)హెర్బర్ట్ మకాలే
సి) కెన్‌సారో వివా
డి) ఎన్ నంది అజికివే

బహుళైచ్చిక ప్రశ్నలు జవాబులు:-
1)బి 2)ఎ 3)బి 4)డి 5)సి 6)ఎ 7)సి 8)బి 9)డి 10)సి 11)సి
12)సి 13)బి 14)డి 15)సి

#Tags