ప్రజలు-వలసలు

ముఖ్యంశాలు:

  1. ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు ‘వలస’ వెళుతున్నారు. వలసదారులు కొత్త వాళ్లతో సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. వారు భిన్న సంస్కృతులను అవగాహన చేసుకుని జీవిస్తున్నారు.
  2. ఆడవాళ్లలో వలసలకి వారి వివాహం ప్రధాన కారణం. మగవాళ్లు ఉపాధి, ఉపాధి అన్వేషణ కోసం వలస వెళుతున్నారు.
  3. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి,విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు మొదలైనవి ప్రజల వలసకు ప్రధాన కారణాలు.
  4. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
  5. వలస ప్రజలకు పట్టణాలు, నగరాలలోని మురికివాడడలలో తగినంత చోటు లేక తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్ధితి మరీ దారుణంగా ఉంటుంది. వీరు అవ్యవస్థీకృత రంగంలో పనిచేయాల్సి వస్తుంది.
  6. 2001-2011 మధ్య కాలంలో పట్టణ జనాభా 9.1 కోట్లకు పెరిగింది. 44% సహజ పెరుగుదల, 32% పట్టణ ప్రాంతాల విస్తరణ, 24% వలసల వల్ల జరిగింది.
  7. మహారాష్ట్రలో చెరుకు కొట్టే వాళ్లు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మరొక గ్రామీణ ప్రాంతానికి వలస వెళుతున్నారు. వలస కార్మికులు వ్యవసాయం, తోటలు, ఇటుక బట్టీలు, గనుల తవ్వకం, భవన నిర్మాణం, చేపల ప్రాసెసింగ్ వంటి పనులు చేస్తారు.
  8. కుటుంబాల వలసల వల్ల వారి పిల్లల చదువులు మధ్యలో మానివేయాల్సి వస్తుంది.
  9. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి.
  10. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయడానికి వలసల చట్టం, 1983 భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది.

కీలక పదాలు:

  1. వలస: విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడడాన్ని వలసగా పేర్కొనవచ్చు.
  2. విదేశీవలస: స్వదేశం విడిచి విద్య, ఉపాధి కోసం వేరొక దేశంలో స్థిరనివాసం ఏర్పర్చుకోవడాన్ని విదేశీవలసగా పేర్కొనవచ్చు.
  3. అంతరాష్ట్ర వలస: స్వదేశంలోనే ఒక రాష్ట్రం విడిచి మరొక రాష్ట్రంలో విద్య, ఉపాధి కోసం వలసపోవడం అంతరాష్ట్ర వలస.
  4. కాలనుగుణ వలస: పనివున్న కాలంలో వున్న ప్రాంతం విడిచి వేరొక ప్రాంతానికి తాత్కాలికంగా వలసపోవడం కాలనుగుణ వలస.
  5. దేశ సరిహద్దు: ప్రతి దేశానికి కొన్ని నిర్దిష్టమైన సరిహద్దులు వుంటాయి.

వ్యాసరూప ప్రశ్నలు:
1. ‘‘వలస కుటుంబాలలోని అధిక శాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు’’ దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జ:

  1. కుటుంబాలు వలస వెళ్లినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్లే చిన్న పిల్లలకు శిశు సంక్షేమ/ సంరక్షణ కేంద్రాలు ఉండవు.
  2. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు.
  3. వాళ్లు స్వగ్రామాలకు తిరిగి వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్లని మళ్లీ చేర్చుకోవు.
  4. ఫలితంగా వలస కుటుంబాలలోని అధికశాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు.
  5. కుటుంబంలో కేవలం మగవాళ్లే వలసకి వెళ్లినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం ఆడవాళ్ల మీద పడుతుంది. ఇలాంటి కుటుంబాలలోని ఆడ పిల్లల మీద తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోవాల్సిన భారం ఉండి చివరకు చాలా మంది బడి మానేస్తారు.
  6. మహారాష్ట్ర నుంచి ప్రతి సంవత్సరం చెరుకు నరకటానికి కూలీలు వలస వెళ్తారు. వారితో పాటు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు 2,00,000 దాకా ఉంటారు. తమ కుటుంబాలతో పాటు వీళ్లు కూడా వలస వస్తారు. పిల్లలు కూడా చెరుకు కుప్పగా చేరుస్తూ, గడ్డలను కట్టలుగా బళ్ల దగ్గరకు చేరుస్తారు.
    పై కారణాల వల్ల వలస కుటుంబాలలో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.

2. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది?
జ:

  1. వలస వెళ్లే వాళ్లలో చాలా మంది, ప్రత్యేకించి దీర్ఘకాలం వలస వెళ్లేవాళ్లు ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారు.
  2. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నారు.
  3. కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్లల్లో చాలా మంది ఇంటికి డబ్బు పంపిస్తారు, మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళ్తారు.
  4. వలస వెళ్లడం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది.
  5. వలస వెళ్లిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనడం సాధారణంగా చూస్తూ ఉంటాం. వలసల వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి చాలా పెరుగుతుంది.

3. వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్లే అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు వలస వెళ్లగలుగుతున్నారు? నైపుణ్యం లేని కార్మికులు ఈ దేశాలకు ఎందుకు వెళ్లలేరు?
జ:

  1. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటి నిపుణులు, డాక్టర్లు, మేనేజ్‌మెంట్ నిపుణులు ఈ రకానికి ఉదాహరణ.
  2. రెండో రకం వలసలు చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని, కొంత నైపుణ్యం ఉన్న పని వాళ్లు. ఈ వలస కార్మికులలో అధిక శాతం భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వాహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో పని చేస్తున్నారు.
  3. అభివృద్ధి చెందిన దేశాలలో అన్ని రకాల అవస్థాపక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉండడం వల్ల నైపుణ్యం లేని పనివాళ్లకు అక్కడ పని లేని కారణంగా వారు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
  4. అభివృద్ధి చెందిన దేశాలలో సాంకేతిక వృత్తి నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఎక్కువగా ఉండడంతో ఆయా దేశాలకు వృత్తి నైపుణ్యం గల వాళ్లు ఎక్కువగా వలస వెళుతున్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. కింది వాటితో ఒక పట్టిక తయారు చేసి వలస కార్మికుల వివిధ ఉదాహరణలను క్రోడీకరించండి.

  1. వలస కార్మికులు
  2. వలసల కారణాలు
  3. వలస వెళ్లిన వాళ్ల జీవన ప్రమాణాలు
  4. వాళ్ల జీవితాల ఆర్థిక స్థితి పై ప్రభావం
  5. వాళ్ల వలస వచ్చిన ప్రాంత ప్రజల జీవితాల ఆర్థిక స్థితి పై ప్రభావం.
క్రమ సంఖ్య వలస కార్మికులు కారణాలు వలస వెళ్లిన వాళ్ల జీవన ప్రమాణాలు వాళ్ల జీవితాల ఆర్థిక స్థితిపై ప్రభావం వారి ప్రాంత ప్రజల జీవితాల ఆర్థిక స్థితి పై ప్రభావం.
1. నర్సింహులు లింగంపల్లి మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సర్వీసు కమిషన్ పరీక్ష పాసయ్యాడు {పస్తుతం ప్రభుత్వ ఉద్యోగి, అందు వల్ల అతని స్థితి గతులు మెరుగుగా వున్నాయి. వలస వల్ల అతని ఆర్థిక స్థితి మెరుగుగా ఉంది. నర్సింహులు వలస రావడం వల్ల తన కుటుంబం, బంధువుల స్థితి మెరుగైనది.
2. రామయ్య నల్లగొండ ఆర్థిక స్థితిని మెరుగు పర్చుకోడానికి సాధారణ స్థితి ఉద్యోగం పొందడం వల్ల మెరుగైన ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం
3. లక్ష్మి మెరుగైన ఆర్థిక స్థితి కోసం ఉపాధి కోసం అవ్యవస్థీకృత రంగం భవన నిర్మాణ కూలీ ఎలాంటి ప్రభావం లేదు.
4. షెక్ మస్తాన్ సాంకేతిక నైపుణ్యం గల వ్యక్తి మెరుగైన ఆదాయం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల అధిక సంపాదన ఆస్తుల కొనుగోలు కుటుంబ సభ్యుల స్థితి మెరుగైనది.

2. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసల మధ్య పోలికలు, తేడాలు రాయండి.
జ:
  1. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
  2. గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళుతున్నారు. వీరు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గల వాళ్లు, దళితులు, ఆదివాసీలు.
  3. కొన్ని రాజకీయ, సామాజిక కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరుగుతుంటాయి. ఋతు సంబంధిత పనుల కోసం ఒక గ్రామీణ ప్రాంతపు వాసులు వేరొక గ్రామీణ ప్రాంతానికి వలస పోతున్నారు.
3. వీటిల్లో దేనిని కాలానుగుణ వలసగా పరిగణించవచ్చు? ఎందుకు?
అ. వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్లడం
ఆ. తమిళనాడులో పసుపు దుంప తీయడానికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి మూడు నెలల పాటు వెళ్లడం
ఇ. సంవత్సరంలో ఆరు నెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలడానికి బీహార్ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లడం.
ఈ. హైదరాబాదులో ఇళ్లల్లో పని చేయడానికి నల్లగొండ జిల్లా నుంచి ఆడవాళ్లు రావడం.
జ: (ఆ, ఇ) విషయంలో జరిగిన పరిస్థితులను మనం కాలానుగుణంగా జరిగే వలసలుగా పరిగణించవచ్చు. పంట కాలం అనగా పసుపుదుంపలు తీసిన తరువాత వారు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోతారు. అదే విధంగా బీహారీలు కొంత కాలం వరకు మాత్రమే ఢిల్లీలో రిక్షాతోలుతారు.

4. మూడు రాష్ట్రాల ప్రజలు చాలా దూరంలోని పశ్చిమ ఆసియాకు ఎలా వెళ్లగలుగుతున్నారు?
జ:
  1. భారతదేశం నుంచి పశ్చిమ ఆసియాకు వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, యూ.ఏ.ఈ కి వెళుతున్నారు.
  2. ప్రతి సంవత్సరం పశ్చిమ ఆసియాకు 3 లక్షల కార్మికులు వలస వెళుతున్నారు.
  3. పశ్చిమ ఆసియాకి వలస వెళుతున్న కార్మికుల్లో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
  4. ఈ వలస కార్మికులలో అధిక శాతం భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వాహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తున్నారు.
  5. కేరళ మొత్తం ఆదాయంలో అయిదింట ఒక వంతు పశ్చిమ ఆసియాలో పని చేస్తున్న వాళ్లు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోంది.

5. అంతర్గత, అంతర్జాతీయ వలసల ప్రభావాల మధ్య పోలికలు, తేడాలు పేర్కొనండి.
జ:

  1. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు, రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు దేశం లోపల వున్న వలసలను అంతర్గత వలసలుగాను, దేశం నుంచి వెలుపల అనగా ఇతర దేశాలకు జీవనం కోసం వెళ్లు వలసలను అంతర్జాతీయ వలసలుగా పిలుస్తారు.
  2. పై రెండు వలసలలో వలసదారుల ఆర్థిక స్థితిగతులు, వారి కుటుంబ ఆదాయాలు పెరుగును. వలస వెళ్లిన వాళ్లు కుటుంబాల అప్పులు తీర్చగలుగుతారు, ఆస్తులు కొనడం, జీవన శైలిలో మార్పులు వాటిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

#Tags