భౌతిక, రసాయన శా స్త్రంలో ‘ 10 ’ గ్రేడ్ పాయింట్లు సాధించండి ఇలా...

సిలబస్ విశ్లేషణ : పదో తరగతి భౌతిక, రసాయన శాస్త్రంలో మొత్తం 14 అధ్యాయాలున్నాయి. అవి.. 1. ఉష్ణం, 2. రసాయన చర్యలు-సమీకరణాలు 3. కాంతి పరావర్తనం 4. ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 5. సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 6. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 7. మానవుని కన్ను - రంగుల ప్రపంచం 8. పరమాణు నిర్మాణం 9. మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక 10. రసాయన బంధం 11. విద్యుత్ ప్రవాహం 12. విద్యుదయస్కాంతత్వం 13. లోహ సంగ్రహణ శాస్త్రం 14. కార్బన్-దాని సమ్మేళనాలు.
  • టెన్త్ పబ్లిక్ పరీక్షలో భౌతిక శాస్త్రం నుంచి ఎక్కువగా భేదాలు రాయడం, ఉదాహరణల ద్వారా వివరించడం, గణనలకు సంబంధించినవి, కారణ సంబంధ ఫలితాలు తెల్పడం, కిరణరేఖా చిత్రాలు గీయడం, ఉత్పాదనలు, అనువర్తనాలు, ఉపయోగాలు, ప్రయోగ కృత్యాలు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
  • రసాయన శాస్త్రంలో క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాలు, అణువుల నిర్మాణం, ఐయూపీఏసీ నామకరణ విధానం, పరమాణు ధర్మాల ఆవర్తన క్రమం, లోహ సంగ్రహణ విధానం, పీహెచ్ విలువలు, రసాయనిక చర్యలు-రకాలు, తుల్య సమీకరణాలు, పరమాణు సిద్ధాంతాలు, సంకరీకరణం, ఆమ్ల, క్షార లవణాల ఉపయోగాలు, అణువులు, ఆకృతులు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
  • భౌతిక శాస్త్రంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం అధ్యాయాల నుంచి పటాలను అడిగే అవకాశం ఎక్కువ. రసాయన శాస్త్రంలో రసాయన చర్యలు-సమీకరణాలు, ఆమ్లాలు-క్షారాలు-లవణాలు, పరమాణు నిర్మాణం, లోహ సంగ్రహణ శాస్త్రం అధ్యాయాల నుంచి పటాలుపై ప్రశ్నలు ఇవ్వొచ్చు.
  • విద్యా ప్రమాణాల వారీగా భారత్వాన్ని పరిశీలిస్తే విషయావగాహనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రశ్నపత్రంలో ఈ విభాగానికి 40% భారత్వం (వెయిటేజ్) ఇచ్చారు.
  • పాఠ్యాంశాల్లోని భావనలను అర్థం చేసుకొని, సొం తంగా వివరించడం, ఉదాహరణలివ్వడం, పోలికలు, భేదాలు చెప్పడం, కారణాలు వివరించడం, విధానాలను విశదీకరించడం అనే అంశాల ఆధారంగా విద్యార్థులు అభ్యసనాన్ని కొనసాగించాలి.
  • విద్యార్థులు విషయాన్ని అర్థం చేసుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, చర్చించడానికి ప్రశ్నలు తయారు చేసుకోవాలి.
  • ప్రయోగాలు చేసే విధానం మాత్రమే కాకుండా పరికరాల అమరిక, నివేదికలు రూపొందించే విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • పాఠ్యపుస్తకంలోని ప్రయోగాలు మాత్రమే కాకుండా సొంతంగా ప్రయోగాలు చేయాలి. ప్రయోగశాలలోని పరికరాలతోనే కాకుండా స్థానికంగా లభించే వనరులతో చేసే ప్రయోగాలపై దృష్టి కేంద్రీకరించాలి.
  • పాఠ్యపుస్తకంలోని విభిన్న భావనలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించగలిగే నైపుణ్యాలు కలిగిఉండాలి. ఇలాంటి నైపుణ్యాల అధారంగా ఇవ్వగలిగే ప్రశ్నలు రూపొందించుకోవాలి.
  • గతంలో మాదిరిగా పటాలను గీయండి అని నేరుగా అడగకుండా పటాలను ప్రశ్నపత్రంలోనే గీసి, భాగాలను గుర్తించమనడం, అసంపూర్తి పటాలు ఇచ్చి పూర్తిచేయమనడం లాంటి ప్రశ్నలు వస్తాయి.
  • ఒక మార్‌‌క బిట్స్‌లో కూడా పటాలకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు.
  • ఉష్ణం, రసాయన చర్యలు-సమీకరణాలు, కాంతి, ప్రవాహ విద్యుత్, ఆమ్లాలు-క్షారాలు-లవణాలు తదితర అధ్యాయాల్లో నిజ జీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ప్రశ్నల స్వభావం...
  • సీసీఈ విధానంలో అన్ని పాఠ్యాంశాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా పాఠం నుంచి నిర్ణీత ప్రశ్నలు, నిర్దేశిత విధానంలో వస్తాయనే విభజన ఉండదు. విద్యా ప్రమాణాలను విద్యార్థులు ఎంతవరకు సాధించారో పరిశీలించేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.
  • విద్యార్థులు జవాబులను సొంతంగా ఆలోచించి రాసే విధంగా ప్రశ్నలుంటాయి. ప్రశ్నలను అవగాహన చేసుకుంటేనే సమాధానాలను సులువుగా రాయగలరు.
  • పాఠ్యపుస్తకంలో ‘అభ్యసనను మెరుగుపరచుకుందాం’ శీర్షిక కింద ఇచ్చిన ప్రశ్నలను యథాతథంగా కాకుండా పాఠానికి సంబంధించిన భావనల ఆధారంగా అనువర్తన రూపంలో ఇస్తారు. ఒకసారి పరీక్షలో వచ్చిన ప్రశ్నలు యథాతథంగా/అదే రూపంలో మళ్లీ రావు. ఆ భావన ఆధారంగా ప్రశ్నను మార్చి ఇస్తారు.
  • విద్యా ప్రమాణాల వెయిటేజ్ ఆధారంగా నాలుగు రకాల ప్రశ్నలను రూపొందిస్తారు. అవి...
    1. వ్యాసరూప ప్రశ్నలు
    2. లఘు ప్రశ్నలు
    3. స్వల్ప సమాధాన ప్రశ్నలు
    4. బహుళైచ్ఛిక ప్రశ్నలు.

పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే...
  • సీసీఈ విధానంలోని పరీక్షలో పూర్తిస్థాయి మార్కులు సాధించాలంటే ప్రయోగశాల, సాధారణ కృత్యాలను నిర్వహించాలి.
  • ఉష్టం, కాంతి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం, కార్బన్ - దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి.
  • అన్ని అధ్యాయాల్లోని ప్రశ్నలన్నింటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి.
  • ఉష్ణం, లోహ సంగ్రహణ శాస్త్రం, ఆమ్లాలు- క్షారాలు-లవణాలు, రసాయనిక చర్యలు-రకాలు, మూలకాల వర్గీకరణ, కార్బన్ దాని సమ్మేళనాలు, కాంతి, విద్యుత్ ప్రవాహం తదితర అధ్యాయాల్లోని అంశాలు సులువుగా అర్థమవుతాయి. కాబట్టి వీటిలోని అన్ని భావనలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
  • ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలను నేర్చుకోవడం వల్ల స్వల్ప సమాధాన ప్రశ్నలు, బిట్స్‌కు సులువుగా సమాధానాలు రాయొచ్చు.
  • బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలిమి, ఏసీ, డీసీ జనరేటర్లు, విద్యుత్ మోటార్, ఎస్, పి, డి ఆర్బిటాళ్ల ఆకృతులు, మాయిలర్ చిత్రం, విద్యుత్ విశ్లేషణ చూపే పటం, ఆమ్ల ద్రావణంలో విద్యుత్ ప్రభావం చూపే పటం, కాంతికి సంబంధించిన కిరణ రేఖాచిత్రాలు, ఉష్ణానికి సంబంధించిన చిత్రాలు, మానవుని కన్ను పటాలను నేర్చుకోవాలి.
  • పిల్లల్లోని సృజనాత్మకత, విలువలు, సౌందర్యాత్మక స్పృహ మొదలైన అంశాలను అంచనా వేసేలా ప్రశ్నలను రూపొందిస్తారు. అందువల్ల ప్రతి విద్యార్థి సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి.
  • ఆయా అంశాలకు సంబంధించి అనేక రకాల ప్రశ్నలను విద్యార్థులే రూపొందించుకోవాలి. ఇందు కోసం ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి.

ప్రశ్నపత్రం విశ్లేషణ
సంగ్రహణాత్మక మూల్యాంకనం-III(పబ్లిక్ పరీక్ష) భౌతిక, రసాయన శాస్త్ర ప్రశ్నపత్రం 40 మార్కులకు ఉంటుంది. ఈ ప్రశ్నపత్రాన్ని ఏడు విద్యా ప్రమాణాలతో రూపొందిస్తారు. కంటెంట్‌కు వెయిటేజీ ఉండదు. అన్ని అధ్యాయాలకు ప్రాధాన్యం ఉంటుంది.
వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు(4 రకాలు) ప్రశ్నపత్రంలో ఉంటాయి.
వ్యాసరూప ప్రశ్నలు-4, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 5, లఘు సమాధాన ప్రశ్నలు 4, బహుళైచ్ఛిక ప్రశ్నలు 20.. మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు.
వ్యాసరూప ప్రశ్నకు 4 మార్కులు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు 2 మార్కులు, లఘు సమాధాన ప్రశ్నలకు -1 మార్కు, బహుళైచ్ఛిక ప్రశ్నలకు - ½మార్కు కేటాయిస్తారు. వీటిలో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే అంతర్గత చాయిస్ ఉంటుంది. మిగిలిన వాటికి చాయిస్ ఉండదు.
ప్రశ్నపత్రంలో పార్‌‌ట-A, పార్‌‌ట -B అనే రెండు విభాగాలుంటాయి. పార్‌‌ట- అ మెయిన్ పేపర్ 30 మార్కులకు, పార్‌‌ట - Bబిట్ పేపర్ 10 మార్కులకు ఉంటాయి. పార్‌‌ట-Aమెయిన్ పేపర్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఒక్క మార్కు ప్రశ్నలు 4 (వరుస సంఖ్య 1 నుంచి 4 వరకు) ఉంటాయి. వీటిలో రెండు భౌతిక శాస్త్రానికి, రెండు రసాయన శాస్త్రానికి సంబంధించినవి. చాయిస్ ఉండదు. ఈ సెక్షన్‌లో 4 ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 4 మార్కులు కేటాయిస్తారు.
4*1= 4 మార్కులు.

రెండో సెక్షన్‌లో సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 5 ప్రశ్నలు (వరుస సంఖ్య 5 నుంచి 9 వరకు). వీటిలో రెండు ప్రశ్నలు భౌతిక శాస్త్రం నుంచి, రెండు ప్రశ్నలు రసాయశాస్త్రం నుంచి, మరొకటి భౌతిక లేదా రసాయన శాస్త్రం నుంచి ఇస్తారు. చాయిస్ ఉండదు. ఈ సెక్షన్‌లో 5 ప్రశ్నలకు 2 మార్కుల చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
5*2= 10 మార్కులు.

మూడో సెక్షన్‌లో వ్యాసరూప ప్రశ్నలు 4 (వరుస సంఖ్య 10 నుంచి 13 వరకు) ఉంటాయి. వీటికి అంతర్గత చాయిస్ ఉంటుంది. పదో ప్రశ్నలో రెండూ భౌతిక శాస్త్రానికి, 11వ ప్రశ్నలో రెండూ రసాయన శాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి. 12వ ప్రశ్నలో ఒకటి భౌతిక, రెండోది రసాయన శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. 13వ ప్రశ్నలో ఒకటి భౌతిక శాస్త్రానికి, మరొకటి రసాయన శాస్త్రానికి సంబంధించిన పటాలను గీస్తూ వివరించే ప్రశ్నలు ఇస్తారు. ఈ సెక్షన్‌లో 4 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 16 మార్కులు కేటాయిస్తారు.
4*4= 16 మార్కులు.

పార్‌‌ట -బి:
బిట్ పేపర్‌లో 14 నుంచి 33 వరకు 20 ప్రశ్నలుంటాయి. వీటిలో ఎక్కువ భాగం విద్యాప్రమాణం ఒకటి (విషయావగాహన)కి సంబంధించినవి. ఈ విభాగంలో బహుళ సమాధాన ప్రశ్నలు, జతపర్చే ప్రశ్నలు, ఆడ్ మ్యాన్ అవుట్, సత్యం, అసత్యం ప్రశ్నలు, పటాలకు సంబంధించినవి వచ్చేందుకు అవకాశముంది. ఈ సెక్షన్‌లోని 20 ప్రశ్నలకు ప్రతిదానికి బీ మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
20* ½= 10 మార్కులు.

సంగ్రహణాత్మక మూల్యాంకనం ఐఐఐకు ఉష్ణం, రసాయన చర్యలు- సమీకరణాలు, కాంతి పరావర్తనం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను-రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం తదితర 14 యూనిట్ల నుంచి ప్రశ్నపత్రం రూపొందిస్తారు.















#Tags