Dr KS Jawahar Reddy: స్కూళ్లు తెరిచే నాటికి పుస్తకాలు, యూనిఫామ్‌ అందించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూన్‌ 12న స్కూళ్లు తెరిచేనాటికి పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌తో పాటు యూనిఫాం, బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

2024–25 విద్యా సంవత్సరం ఏర్పాట్లు, నాడు – నేడు పనుల ప్రగతిని, మధ్యాహ్నం భోజనంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. రానున్న విద్యా సంవత్సరానికి సన్నాహక ఏర్పాట్లను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

జూన్‌ 12న స్కూళ్లు పున:ప్రారంభమవుతాయని, 10వ తేదీలోగా విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫాం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవీణ్‌ ప్రకాశ్‌ చెప్పారు. ఇప్పటికే 82 శాతం పుస్తకాలు మండల స్టాకు పాయింట్లకు చేరాయని వివరించారు.

చదవండి: Free Text Books: ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం.. ఈసారి పదో తరగతి పాఠ్య పుస్తకాలు ఇలా..

1 నుండి 10వ తరగతి వరకు 70,42,012 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ అయినట్లు చెప్పారు. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 36,54,539 మంది విద్యా­ర్థులు ఎన్‌రోల్‌ అయ్యారన్నారు. ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు, యూనిఫామ్‌లు, బ్యాగులు సమకూర్చింది, ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై ప్రతి రోజూ పర్యవేక్షించి, సకాలంలో విద్యార్ధులకు అందేలా  చూడాలని సీఎస్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, కృషోన్నతి యోజన కింద వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని పథకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసేందుకు కన్సాలిడేటెడ్‌ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024–25 అమలు­పై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్‌ కమిటీ సమావేశం కూడా సీఎస్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద చేపట్టే వివిధ పథకాలకు నిధుల మంజూరు తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

#Tags