Anganwadi Centers Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రాలు

Anganwadis news

మొయినాబాద్‌: టీచర్లు, ఆయాలు లేక రెండు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో ఐసీడీఎస్‌ ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం సరిగా అందడంలేదు.

మండల పరిధి శ్రీరాంనగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేసే టీచర్‌ ఉద్యోగం మానుకోగా.. అంతకు ముందే ఏడాది క్రితం అనారోగ్యంతో ఆయా మరణించింది. దీంతో ఆరు నెలలుగా ఆ కేంద్రం తెరచుకోవటం లేదు. ఎత్‌బార్‌పల్లిలో టీచర్‌, ఆయా ఇద్దరూ ఉద్యోగాలు మానుకోవడంతో ఆ సెంటర్‌ మూతపడింది.

అందని పౌష్టికాహారం

ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తుంది. 3–5 సంవత్సరాల పిల్లలు కేంద్రాలకు వస్తే భోజనం, గుడ్డు, పాలు ఇస్తారు. గర్భిణులకు మధ్యాహ్నం భోజనం, గుడ్డు, పాలు అందజేస్తారు. రెండు సెంటర్లు మూసివేయడంతో వారికి పౌష్టికాహారం అందడం లేదు.

Latest Lecturer jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం, గుడ్లను కేంద్రం ద్వారా ఇంటికి పంపిణీ చేస్తారు. ఇవి మూసివేయడంతో పక్క గ్రామాల టీచర్లు నెలలో రెండు సార్లు వచ్చి బాలామృతం, గుడ్లు అందజేస్తున్నారు. శ్రీరాంనగర్‌లో సురంగల్‌ టీచర్‌, ఎత్‌బార్‌పల్లిలో తోలుకట్ట టీచర్‌ పౌష్టికాహారాలు అందజేస్తున్నారు.

3–5 ఏళ్లలోపు పిల్లలు ప్రైవేటు బడికి వెళ్తున్నారు. అలా వెల్లని వారు.. ఇంటి వద్దే ఉంటున్నారు. శ్రీరాంనగర్‌లో 15 మంది, ఎత్‌బార్‌పల్లిలో 10 మంది పిల్లలది ఇదే పరిస్థితి.

పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం

త్వరలో పోస్టుల భర్తీ

సెక్టార్‌ పరిధి శ్రీరాంనగర్‌, ఎత్‌బార్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేరు. ప్రస్తుతం పక్క గ్రామాల టీచర్లు ఈ పిల్లలకు బాలామృతం, గుడ్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. రిక్రూట్‌మెంట్‌ కాగానే రెండు గ్రామా ల్లో అంగన్‌వాడీ కేంద్రాలు తెరచుకుంటాయి.- రవిత, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, మొయినాబాద్‌

#Tags