Kendriya Vidyalayas: ఈ జిల్లాకు మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు

నరసరావుపేట: పల్నాడు జిల్లాకు మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. మాచర్ల నియోజకవర్గంలోని తాళ్లపల్లి, నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో వీటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించగా అందులో రెండు జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ విద్యాలయాల ఏర్పాటు కోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విశేష కృషి చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిలకలూరిపేటలో కేంద్రియ విద్యాలయం అందుబాటులోకి వచ్చేలా ఎంపీ లావు చర్యలు తీసుకున్నారు. పల్నాట ఇప్పుడు తాజాగా మరో రెండు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లిలో మాత్రమే ఈ విద్యాలయాలు నడుస్తున్నాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావటమే లక్ష్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పనిచేస్తున్నారు.

విద్యాసదుపాయాల మెరుగే లక్ష్యం
పల్నాడులో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కావడం ఆనందంగా ఉంది. పల్నాడులోని ఏడు నియోజకవర్గాల్లోనూ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తాను. ఇది నా లక్ష్యం.
– శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట

#Tags