School Fee Regulation In Telangana: స్కూలు ఫీజులు తగ్గుతాయా? ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది. ఈమేరకు కసరత్తు వేగవంతం చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.
2024–25 విద్యా సంవత్సరం జూన్ 12నుంచి పునః ప్రారంభం కానుంది. ఆలోపు ఫీజు నియంత్రణకు సంబంధించి స్పష్టత, ఉత్తర్వు లు వస్తే ఆ మేరకు తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపులపై అంచనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత కసరత్తు వేగవంతం చేసినప్పటికీ ఫీజు నియంత్రణ చట్టం ఖరారయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు అనుమానంగానే ఉంది. చట్టం రూపకల్పన, ఆ తర్వాత చట్టసభల్లో ఆమెదం తర్వాతే ఫీజు నియంత్రణకు లైన్ క్లియర్ కానుందని, దీంతో 2025–26 నుంచి ఈ చట్టం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఒకటో తరగతికి ఆరేళ్ల మాటేమిటి?
మరోవైపు ఒకటో తరగతిలో ప్రవేశానికి 6 సంవత్సరాల వయసు నిండి ఉండాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నిబంధనల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ ఈ అంశంపైనా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు, కేరళ, హర్యానా సహా చాలా రాష్ట్ర ప్రభు త్వాలు ఈ వయస్సు ప్రమాణా లపై ఎలాంటి నిర్ణ యం తీసుకోని నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నాటికే ఈ అంశంపై స్పష్టత రానుందని అధి కారవర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరి మితి నిబంధనతో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ప్రచారం ఉంది. కాగా, 2024–25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల వయోపరిమతి నిబంధనతోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.