Model School: మోడల్‌ స్కూల్‌లో ‘మాక్‌ అసెంబ్లీ’

సంగెం: మండలంలోని గవిచర్ల మోడల్‌ స్కూల్‌లో బుధవారం మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా సాధికారత ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా మారి నమూనా శాసన సభ సమావేశం జరిగే విధానాన్ని కళ్లకుకట్టినట్లుగా నిర్వహించారు. మాక్‌ అసెంబ్లీలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఊటంకిస్తూ ప్రశ్నల రూపంలో సంధిస్తూ సభను విజయవంతంగా నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులుగా అభినయించిన విద్యార్థులు ప్రశ్నలు అడిగిన తీరు, సమాధానాలు చెప్పిన విధానం వీక్షకులను ఆకట్టుకుంది. విద్యార్థి దశలోనే సమకాలీన రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలపై అవగాహన కలిగే విధంగా మాక్‌ అసెంబ్లీని నిర్వహించారు. అనంతరం జెండర్‌ స్పెషలిస్ట్‌ ఆర్‌.రమాదేవి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, మహిళా సాధికారత గురించి వివరించారు. మాక్‌ అసెంబ్లీని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల బృందం పరిమల, వనిత, వెంకటరమణి, రమేష్‌ నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ముజుబూర్‌ రహమాన్‌, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags