College Fees: కళాశాలల్లో ఫీజుల దందా..

నిజామాబాద్‌అర్బన్‌: సీఎస్‌ఎఫ్‌ పేరిట తెలంగాణ యూనివర్సిటీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రైవేటు డ్రిగీ కళాశాలల నుంచి అందాల్సిన రూ. కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఈ సారి ఎలాగైనా వసూలు చేస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 50 ప్రైవేటు, 26 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు ప్రవేశం పొందేటప్పుడు వారి నుంచి సీఎస్‌ఎఫ్‌ (కామన్‌ సర్వీస్‌ ఫీజు) పేరిట వసూలు చేస్తున్నాయి.
వీటిని ఆయా కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ యూనివరిట్సీకి చెల్లించాలి. కానీ వాటిని చెల్లించకుండా గత మూడేళ్లుగా నాన్చుతూ తప్పించుకు తిరుగుతున్నాయి. అధికారులు సైతం సీఎస్‌ఎఫ్‌ చెల్లించని కళాశాలలకు నోటీసులు జారీ చేసినా ఆయా కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తీసుకువస్తూ అధికారులను మభ్యపెడుతూ ఫీజులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాయి.

ప్రతి ఏటా 30 వేల మంది..
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు సంబంధించి ప్రతిఏటా 30 వేల మంది విద్యార్థుల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీటిని యూనివర్సిటీకి చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు రెండు, మూడేళ్లుగా విద్యార్థుల సీఎస్‌ఎఫ్‌ ఫీజులు చెల్లించక యూనివర్సిటీకి ఎగనామం పెడుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం మూడు కళాశాలలు మాత్రమే సీఎస్‌ఎఫ్‌ను చెల్లించాయి. దీంతో ఇప్పటి వరకు యూనివర్సిటికీ రావాల్సిన సుమారు రూ. రెండున్నర కోట్ల ఫీజు రాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి.

బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డిలో..
బోధన్‌లోని ఓ కళాశాల రెండేళ్లు, ఆర్మూర్‌లోని ఓ కళాశాల ప్రజాప్రతినిధి ఒత్తిడితో మూడేళ్లు, కామరెడ్డిలోని ఓ కళాశాల యాజమాన్యం తమ రెండు కళాశాలలకు చెందిన ఫీజులను చెల్లించక తప్పించుకు తిరుగుతున్నాయి. వీటికి యూనివర్సిటీ అధికారులు సీఎస్‌ఎఫ్‌ చెల్లించాలని నోటీసులు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

సీరియస్‌గా యూనివర్సిటీ అధికారులు
సీఎస్‌ఎఫ్‌ ఫీజు చెల్లించని డిగ్రీ కళాశాలపై వర్సిటీ అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఇటీవల సంబంధిత కళాశాలలకు నోటీసులు సైతం జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎస్‌ఎఫ్‌ చెల్లించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనంతరం కళాశాలల యాజమాన్యాలు అసోసియేషన్‌ తరఫున యూనివర్సిటీ ఉన్నతాధికారులను కలిసి మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా అధికారులు సైతం సీఎస్‌ఎఫ్‌ చెల్లించాల్సిందేనని వారితో పేర్కొన్నట్లు సమాచారం. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజును ఎందుకు చెల్లించడం లేదని ఉన్నతాధికారులు నిలదీసినట్లు తెలిసింది.

సీఎస్‌ఎఫ్‌ పేరిట విద్యార్థుల నుంచి వసూళ్లు యూనివర్సిటీకి చెల్లించకుండా మూడేళ్లుగా తప్పించుకుంటున్న యాజమాన్యాలు సీరియస్‌గా తీసుకున్న వర్సిటీ అధికారులు

ఆందోళనలు చేస్తాం
ప్రైవేటు డిగ్రీ కళశాలలు విద్యార్థుల నుంచి రూ. వేల చొప్పున వసూలు చేస్తున్న కామన్‌ సర్వీస్‌ ఫీజును యూనివర్సిటీకి చెల్లించక పోవడం సిగ్గుచేటు. తక్షణమే ఆయా కళాశాలల యాజమాన్యాలు సీఎస్‌ఎఫ్‌ చెల్లించాలి. లేకుంటే ఆందోళనలు, ధర్నాలు చేపడుతాం.– రఘురాం, ఏఐఎస్‌ఎఫ్‌,

రాష్ట్ర సహాయ కార్యదర్శి చర్యలు తీసుకోవాలి
కామన్‌ సర్వీస్‌ ఫీజు పేరిట విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న వాటిని ఆయా యాజమాన్యాలు యూనివర్సిటీకి చెల్లించాలి. లేకుంటా ఆయా కళాశాలల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతాం. సీఎస్‌ఎఫ్‌ చెల్లించని వాటిపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. – లాల్‌సింగ్‌, టీవీయూవీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

#Tags