H1B visa renewal Problem: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు H1B Visa renewal కష్టాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు.
NMDC లో భారీగా జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం 50వేలు: Click Here
యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.
హెచ్1బీ వీసా రెన్యువల్
హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్‌ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.
డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదల
తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్‌ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్‌లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్‌లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.
డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?
డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్‌మెంట్‌ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్‌లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది.