Anganwadi Schools: ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్‌వాడీలు.. కాన్వెంట్‌ స్కూళ్లకు ధీటుగా

మహబూబ్‌నగర్‌ రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలు ఇక పూర్వ ప్రాథమిక ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను అందించనున్నాయి. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్‌లకు పంపడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

దీంతో అంగన్‌వాడీల్లో రోజురోజుకు చిన్నారుల సంఖ్య తగ్గుతుండటంతో కాన్వెంట్‌లకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ దిశగా చర్యలు చేపడుతోంది. జిల్లా పరిధిలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల (మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌, జడ్చర్ల, దేవరకద్ర) పరిధిలో 1,185 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ క్రమంలోనే రెండున్నరేళ్లు పైబడిన పిల్లలను అంగన్‌వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్‌లో చేర్పించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మబాట.. అంగన్‌వాడీ బాట పేరిట తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 11 మంది సూపర్‌వైజర్లను ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వారు మాస్టర్‌ ట్రైనర్లుగా వ్యవహరించి అంగన్‌వాడీ టీచర్లకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సిలబస్‌ను సైతం సిద్ధం చేసి పిల్లలకు కిట్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Ts Dsc 2024 For Disabled Students: తొలిసారి డీఎస్సీలో.. దివ్యాంగ విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల నియామకం


రెండున్నరేళ్లు నిండిన పిల్లలను అంగన్‌వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామాల్లో అమ్మబాట– అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.

● 15, 16 తేదీల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, యువత, ఎన్జీఓస్‌ తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించి.. సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

● 18న రెండున్నరేళ్ల పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించడం, ప్రీ ప్రైమరీ పాఠశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఐదేళ్లు నిండిన పిల్లలకు ప్రీ స్కూల్‌ సర్టిఫికెట్‌ అందించి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పిస్తారు.

● 19న అంగన్‌వాడీ కేంద్రాల్లో తరగతి గదులను శుభ్రం చేసి ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కలు నాటాలి. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతారు. పిల్లలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రీ స్కూల్‌ సిలబస్‌ ప్రదర్శిస్తారు.

TSRTC Jobs: సొంతంగా పోస్టుల భర్తీ అధికారం కోల్పోయిన ఆర్టీసీ.. ఖాళీలు ఉన్నా రిక్రూట్‌మెంట్‌కు నో

● 20న ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ డెవలప్‌మెంట్‌ డే (ఈసీసీఈ), సామూహిక అక్షరభ్యాసం నిర్వహిస్తారు. ప్రీ స్కూల్‌ ప్రాధాన్యతను తల్లిదండ్రులకు తెలియజేసేలా మెరిటీరియల్‌ ప్రదర్శిస్తారు. దీంతో ఆరురోజులపాటు నిర్వహించిన అమ్మబాట– అంగన్‌వాడీ బాట ముగిస్తుంది.

టీచర్లకు శిక్షణ ఇచ్చాం..
అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై శిక్షణ ప్రారంభించాం. బాలల విద్యపై ఇప్పటికే పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీఓలతో కూడిన కమిటీ, సిలబస్‌, ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. అందులో భాగంగానే సోమవారం నుంచి శనివారం వరకు అమ్మబాట– అంగన్‌వాడీ బాట పేరిట ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించి ప్రీ స్కూల్‌పై అవగాహన కల్పించనున్నాం. 
– జరీనాబేగం,జిల్లా నేత, శిశు సంక్షేమశాఖ అధికారి


కేంద్రాల అభివృద్ధి..
రెండున్నరేళ్లు నిండిన పిల్లలను ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. ప్రాథమిక పాఠశాలలో చేరేలోపు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను ప్రీ ప్రైమరీ స్కూల్‌లో నేర్పుతారు. తద్వారా పాఠశాలల్లో చదవడం, రాయడం లాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. అంతేకాక కేంద్రాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
– శాంతిరేఖ,సీడీపీఓ, మహబూబ్‌నగర్‌ రూరల్‌
 

#Tags