Job Mela: నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు
కాటారం: నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. జీవితంలో స్థిరపడాలని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లో ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్‌మేళా నిర్వహించారు. తొమ్మిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగుల విద్యార్హత, స్కిల్స్ తదితర అంశాలపై ఆరా తీశారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన 156మంది నిరుద్యోగ యువతీయువకులు జాబ్‌మేళాకు హాజరుకాగా 123మందికి పలు కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
ఈ సందర్భంగా పీఓ అంకిత్ మాట్లాడుతూ యువత సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించాలని సూచించారు. పట్టుదలతో శ్రమిస్తే ప్రతీది సాధ్యమవుతుందని.. యువత లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్లాలన్నారు. ముందుగా ఒక ఉదోగంలో చేరితే అనుభవం వస్తుందని.. దానితో ఎన్నో ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు. జీవితంలో అనేక అవకాశాలు వస్తాయని వాటిని చేజార్చుకోకూడదని అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 15 జాబ్‌మేళాల ద్వారా 2వేల మంది గిరిజన నిరుద్యోగ యువతకు పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పీఓ తెలిపారు.
నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఐటిడీఏ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు పీఓ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, జేడీఎం కొండలరావు, డీపీఎం సతీశ్, లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్, జేఆర్పీలు రాజ్‌కుమార్, శివ, పాపారావు, ఐటీఐ ప్రిన్సిపాల్ భిక్షపతి, పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.