Skip to main content

ట్రిపుల్‌ఐటీ..చదువుల దివిటీ

పేద విద్యార్థులకు వరం ● క్రమశిక్షణ, ఉత్తమ బోధన సొంతం ● చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ● దరఖాస్తులకు 26 వరకు గడువు
Triple IT
Triple IT

నూజివీడు: ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్‌ఐటీ సొంతం. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు నిలయమైన ట్రిపుల్‌ఐటీలో చదువుతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఉదయం అల్పాహారం అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, 12 గంటల నుంచి 1 గంట వరకు భోజన విరామం, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్‌, 6 గంటల వరకు ఆటలు, రాత్రి 7 గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌.. ఇవీ ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు.

1,100 సీట్లు

2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 1,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో 100 కలిపి మొత్తం 1,100 సీట్లు ఉన్నాయి. వీటిని రోస్టర్‌ ప్రకారం భర్తీ చేయడంతో పాటు ప్రత్యేక కేటగిరీ కింద స్పోర్ట్స్‌, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, సీఏపీ, ది వ్యాంగులు, ఎన్‌సీసీ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజులు ఇలా..

మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.40 వేలు, తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.50 వేల చొప్పున ఫీజు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

యోగా.. నృత్యం.. సంగీతం

ఒకవైపు ఇంజినీరింగ్‌ విద్యను అందిస్తూనే మరోవైపు యో గా, నృత్యం, సంగీతంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగశాలలో యోగాను నేర్పుతారు. అలాగే స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌లో నృత్యం, సంగీతంలో శిక్షణ ఇస్తారు.

వచ్చేనెల 13న అర్హుల జాబితా

ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో అ ర్హుల జాబితాను వచ్చేనెల 13న విడుదల చేస్తారు. వచ్చేనెల 21, 22 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఏ క్యాంపస్‌లో సీటు వస్తే అక్కడే చదవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి

పదోతరగతి హాల్‌టికెట్‌, పదో తరగతి గ్రేడ్‌షీట్‌, పదోతరగతి టీసీ, కాండక్ట్‌ సర్టిఫికెట్‌, స్టడీ సర్టిఫికెట్‌ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు. అభ్యర్థి, అతని తండ్రిది లేదా తల్లివి రెండు పాసుపోర్టు ఫొటో లు, రేషన్‌కార్డు, అభ్యర్థి ఆధార్‌కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు రుణం అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్‌, అభ్యర్థి తండ్రి పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు ఐడీతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.

ప్రతిభ ఆధారంగానే..

ట్రిపుల్‌ఐటీలో సీట్లు ప్రతిభ ఆధారంగానే కేటాయిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటు లభిస్తే ఆరేళ్ల పాటు ఉచిత విద్య అభ్యసించి ఇంజినీరింగ్‌ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చు.

– ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు. ఆర్జీయూకేటీ అడ్మిషన్ల కన్వీనర్‌, నూజివీడు

విద్యాబోధన ఇలా..

ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌లో మొదటి రెండేళ్లు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సు, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ విద్యను బోధిస్తారు. ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు కొనసాగుతాయి. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. సెలవు రోజు ల్లో తల్లిదండ్రులు వచ్చి పిల్లలతో గడపడానికి అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలను ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్‌ విధిస్తారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ట్రిపుల్‌ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆస్పత్రి ఉండగా ఇక్కడ 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.

Published date : 12 Jun 2023 05:49PM

Photo Stories