10th & Inter Exams Preparation Plan: పది, ఇంటర్ పరీక్షలు కీలకం.. ఇదీ ప్రణాళిక..
కడప ఎడ్యుకేషన్: విద్యార్థి జీవితంలో పది, ఇంటర్ పరీక్షలు కీలకం. వారి జీవితాలు మలుపు తిరిగేది కూడా ఇక్కడే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పది, ఇంటర్‌లలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షల నిర్వహణను చేపట్టారు. చదువులో వెనుకబడిన పిల్లలను సైతం కనీస మార్కులతో గట్టెక్కించేలా చూడాలని అధికారులు సీఆర్‌సీ, పీజీటీలు, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు పంచతంత్ర పేరుతో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రత్యేక ప్రణా ళికలను సిద్ధం చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులతోపాటు వారంతంలో గ్రాండ్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీలైనంత మంది విద్యార్థులు ఉత్తమ మార్కులను సాధించేలా చర్యలు చేపట్టారు.
ఇదీ ప్రణాళిక..
కేజీబీవీల్లో చదువుతున్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు రాష్ట్ర అధికారులు పంచతంత్ర పేరుతో 100 రోజుల ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక అన్ని కేజీబీవీల్లో ప్రారంభమైంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 5 నుంచి 6.30 ప్రైవేటు టైమ్.. 6.30 నుంచి 7.30 వరకు సజ్జెక్టు ప్రిపరేషన్..7.30 నుంచి 8.30 వరకు వీక్లీ టెస్టు, 8.30 నుంచి 9 గంటల వరకు బ్రేక్‌ఫాస్ట్, 9 నుంచి 9.15 వరకు అసెంబ్లీ, 9.15 నుంచి 10.45 వరకు సబ్జెక్టు–1, 10.45 నుంచి 11 గంటల వరకు బ్రేక్, 11 గంటల నుంచి 12.30 వరకు సబ్జెక్టు–2, 12.30 నుంచి 1.15 వరకు లంచ్ బ్రేక్, 1.15 నుంచి 2.45 వరకు సబ్జెక్టు–3, 2.45 నుంచి 3 గంటల వరకు బ్రేక్, 3 నుంచి 4.30 వరకు సబ్జెక్టు–4, 4.30 నుంచి 5 వరకు బ్రేక్, 5 నుంచి 6.30 వరకు సబ్జెక్టు –5, 6.30 నుంచి 7.30 డిన్నర్. రాత్రి 7.30 న ఉంచి 10 గంటల వరకు సబ్జెక్టు–6 ఉంటుంది. ఇలా ప్రతి రోజు ప్రణాళిక అమలు జరుగుతుంది.
- జిల్లాలోని కేజీబీవీల్లో 90 శాతం పైన ఉత్తీర్ణులైన విద్యార్థులకు సమగ్రశిక్ష ద్వారా బహుమతి, ప్రశంసాపత్రం అందచేయనున్నారు.
- పది, ఇంటర్‌లో 100 శాతం ఫలితాలు సాధించిన కేజీబీవీలకు రూ. 25 వేలు నగదు బహుమతి ప్రశంసాపత్రం అందస్తారు.
- పది ఇంటర్ రెండింటిలో 100 శాతం ఫలితాలను సాధించిన కేజీబీవీలకు రూ. 50 వేలు నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇస్తారు.
- సీఆర్‌టీ, పీజీటీలు తమకు సంబంధించిన సబ్జెక్టుల్లో 100 శాతం ఫలితాలను సాధిస్తే ప్రశంసా పత్రంతో సత్కరిస్తారు.
- 90 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి రూ. 5 వేలు నగదు బహుమతి ఉంటుంది.
జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 614 మంది పదో తరగతి చదువుతుండగా 373 మంది ఇంటర్ ప్రథమ , 290 మంది ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరందరి కోసం సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు ప్రత్యేకంగా పంచతంత్ర ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇందుకోసం కేజీబీవీల్లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్లతోపాటు సీఆర్టీ, పీజీటీలు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఒక్కొక్కరు ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకున్నారు. వారు ఎలా చదువుతన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారనే అంశాలను పరిశీలిస్తారు. లోపాలంటే వాటిని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు కార్యాచరణ అమలును కేజీబీవీల జీసీడీవో పర్యవేక్షిస్తారు.