Exams Time: భయపడకుండా.. ఎగ్జామ్స్ రాయండిలా..!
‘కోవిడ్ టైమ్‌లోనే బాగుంది. కాలేజీకి వెళ్లి అందరిలో కూర్చోవాలంటే ఏంటోగా ఉంది’ విసుగు ‘నేనసలు బాగుపడతానా? ఈ లైఫ్ పెద్ద బోర్.. ’ డిప్రెషన్. ‘అనుకున్న టైమ్‌లో చదవాల్సిన సిలబస్ పూర్తవుతుందా?’ ఒత్తిడి.
కాలేజీ స్టూడెంట్స్ తమ భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒత్తిడుల నుంచి దూరం అవ్వడానికి ఉచితంగా ‘డాక్టరైట్ వెల్‌నెస్ యాప్’ ద్వారా సేవలను అందిస్తున్నారు హైదరాబాద్ వాసులు రజినీకాసు, జయంతీ సుబ్రహ్మణ్యం, ప్రసన్నలక్ష్మి, మధు రఘునాయకులు. ‘17 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో భావోద్వేగాల బ్యాలెన్స్ చేసుకోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఎవరితో చెబితే ఏం సమస్యో అనుకునే వయసు అవడంతో ఎవరికీ చెప్పుకోలేక, జీవితంలో వెనకడుగు వేసేవారికి నేస్తంలా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాం’ అని వివరిస్తున్న ఈ బృందం చెబుతున్న విషయాలు ఇవి..
నేరుగా ఎదుర్కోలేని ఒత్తిడిని..
‘‘ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ స్టూడెంట్స్‌ను నేరుగా కాలేజీలకు వెళ్లి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ ఏజ్‌గ్రూప్‌లో వచ్చే రకరకాల సింప్టమ్స్‌ని సరైన సమయంలో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వీరిలో సోషల్ ఇంట్రాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయని గమనించాం. కోవిడ్ సమయంలో వర్చువల్‌గా మాట్లాడిన పిల్లలు ఆ తర్వాత కాలేజీలో నేరుగా ఫ్రెండ్స్‌తో కూడా ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడుకోవడం కష్టపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థుల్లో మార్పు కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనను ఇలా అమలులో పెట్టాం’ అంటారు రజని కాసు. ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న రజిని కాసు విద్యార్థుల మానసిక సమస్యలపై కౌనెలర్లతో చర్చించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
అంతా కొత్తగా ఉండటంతో..
‘‘దాదాపు ఇంటి దగ్గరే రెండేళ్లుగా కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నవాళ్లు నేరుగా ప్రతిభ చూపించమంటే వారి ఆత్మవిశ్వాసం స్థాయిలో మార్పులు వచ్చాయి. సాధారణంగా డిగ్రీస్థాయి పిల్లలకు ఫస్ట్ ఇయర్‌లో కాలేజీ వాతావరణం అంతా అలవాటు పడుతుంది. కానీ, ఆన్‌లైన్ క్లాసుల నుంచి నేరుగా కాలేజీకి రావడంతో అంతా కొత్తగా ఉండటంతో ప్రతి చిన్న విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్యాడ్జెట్స్‌తోనే టైమ్ అంతా స్పెండ్ చేస్తున్నారు.
పేరెంట్స్ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తున్నప్పటికి..
అమ్మాయిలు–అబ్బాయిల్లో కెరియర్ పరంగా ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ, అమ్మాయిలు ‘వేధింపు’ అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. పేరెంట్స్ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తున్నప్పటికీ, ఎంత స్నేహంగా ఉన్నా అన్నీ పెద్దలకు చెప్పుకోలేరు. పిల్లలు తమ భావాలను సరైన దారిలో పెట్టడానికి అనువైన వేదిక దొరకడం లేదు. ఇవన్నీ విద్యార్థులతో ఈ ఏడాది కాలంగా మాట్లాడి తెలుసుకున్నవి’ అని వివరించారు అమెరికాలో హెల్తెకేర్ లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ విభాగంలో వర్క్ చేస్తున్న జయంతి.
మానసికంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో..
‘మనం కోపంగా చెప్పిన విషయేమేదీ పిల్లలు అర్ధం చేసుకోరు. అంతకు ముందు వాళ్లేం చెబుతున్నారో మనం శ్రద్ధగా వినాలి. ‘ఏం కాదు’ అనే మాట ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఉన్న బాధ అంతా ఏడుపు రూపంలో బయటకు రావాలి. అప్పుడు వారు మానసికంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో దాని నుంచి దూరమవుతారు. చెప్పడం నుంచే రియలైజ్ అవడం కూడా మొదలు పెడతారు. అప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టచ్చు. బయటకు ఎవరికీ ఏం చెప్పుకోకుండా తమలో తామే అన్నట్టుగా ఉన్న వాళ్లు చాలావరకు డిప్రెస్ అవుతున్నారు. ఈ విధానం నుంచి బయటపడటానికి యాప్ ద్వారానే రకరకాల యాక్టివిటీస్‌ను కూడా పరిచయం చేస్తున్నాం’ అని తెలియజేశారు ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న మధు.
భయం నుంచి దూరంగా..
‘కొన్ని భయాలు.. చెప్పుకోదగినంత పెద్దవీ కావు, చెప్పకూడనంత చిన్నవీ కాదు. ఈ సమస్య స్కూల్, కాలేజీ రోజుల్లో మొదలైతే ఆ తర్వాత కెరియర్‌లోనూ ఎదుర్కోవచ్చు. భయాన్ని వీడలేక రకరకాల వ్యసనాలకు లోనైనవారూ ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలన్నా సరైన గైడెన్స్ విద్యార్థులకు చాలా అవసరం. కోవిడ్ టైమ్‌లో ‘కోవిడ్ సాథీ’పేరుతో హెల్ప్‌లైన్ అందించిన మా గ్రూప్ సభ్యులం ఇప్పుడు ఈ యాప్ ద్వారా విద్యార్థులకు మేలు చేయాలనుకుంటున్నాం. ఏడాది క్రితం 6 వేల మంది విద్యార్థులకు చేరువఅవ్వాలని ఈ వర్క్ ప్రారంభించాం.
ఇప్పుడు 2 వేల మంది విద్యార్థులు రోజూ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. రోజులో 24 గంటలూ స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటున్నాం. ఈ యాప్ నుంచి సైకియాట్రిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, శిక్షణ పొందినవాళ్లూ విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని వాళ్లు తమ సమస్యలను నిపుణులతో చర్చించి సరైన మార్గం తెలుసుకోవచ్చు’ అని వివరించారు ఫార్మసీ రంగంలో ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్రసన్నలక్ష్మి.