Educational Reforms: విద్యా సంస్కరణలకు ఆద్యుడు ఆజాద్
సత్తెనపల్లి: దేశ విద్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు.. విద్యా సంస్కరణలకు ఆద్యుడు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నవంబర్ 11 శనివారం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలో ఉన్నత విద్యారంగానికి నిరుపుమాన సేవలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించారని కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణలకు నాంది పలికిందన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా సుస్థిర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆలోచనలు ప్రపంచ స్థాయిలో ఉండాలని సూచించారు. విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మౌలానా అబుల్ కలాం ఆజాద్ భావించారని అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు సాగుతూ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని వివరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయవాదిగా, హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేసిన సుప్రసిద్ధ నేతగా, ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఆయనతో పాటు సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, నియోజకవర్గ నాయకుడు పక్కాల సూరిబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగుర్ మీరాన్, రమావత్ కోటేశ్వరావు నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ పాల్గొన్నారు.
చదవండి: Lecturer Jobs: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
విద్యాభివృద్ధికి ఆజాద్ కృషి
నరసరావుపేట: దేశంలో విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ అంకితభావంతో పనిచేశారని పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు పూలు చల్లి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అబుల్ కలాం అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అన్నారు. అబుల్ కలామ్ అనేది ఆయనకు బిరుదని, ఆజాద్ అనేది ఆయన కలం పేరు అన్నారు. అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ భాషలలో మంచి ప్రావీణ్యత ఉందన్నారు. స్వయంగా సాహితీవేత్త అయిన ఆయన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాశారన్నారు. 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారని, ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం వ్యక్తి జన్మహక్కుగా పరిగణించాలని, లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరని పేర్కొన్నారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్‌కే చంద్రశేఖర్, డి.రామచంద్రరాజుు, డీఎస్పీ కేవీ మహేష్ పాల్గొన్నారు.