Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు.. మన విద్యార్ధులను హెచ్చరించిన భారత్
అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం అనవసరమంటూ గట్టి సంకేతాలే పంపారు. మొన్నటి వరకు చర్చలకు సిద్ధమన్న రష్యా అకస్మాత్తుగా మిలిటరీ ఆపరేషన్‌కి చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప‍్రమత్తమైంది. అక్కడ ఉన్న మన భారతీయ విద్యార్థులను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విద్యార్థులు, పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇక్కడ వేచి ఉండవద్దని హెచ్చరిక..
ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రత కోసం ఉక్రెయిన్‌లో ఉన్న కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఓ సలహాను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు తాత్కాలికంగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొంది. ఆన్‌లైన్ క్లాసుల్లో నమోదుకు సంబంధించి వారి కళాశాలల నుంచి నిర్ధారణ కోసం వేచి ఉండవద్దని కోరింది. అంతకు ముందు ఉక్రెయిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఎంబసీ అధికారులు తెలిపారు.
ఈ సూచనలే పాటించండి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లను ఎక్కడివార్కడే ఆగిపోవాలంటూ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఉక్రెయిన్ క్రైసిస్ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.
ఇంకా 18 వేల మంది.. తెలుగు విద్యార్థులు 1000 మంది..?
ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తలు ప్రారంభం కాగానే చాలా మంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్సిటీల నుంచి సెలవు/ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. . ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఉక్రెయిన్‌లో ఇంకా 18 వేల మంది వరకు ఇండియన్లు ఉండవచ్చని అంచనా.
ఎయిర్ స్పేస్ క్లోజ్..
పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21 నుంచి ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమనాలు పంపారు. ప్రతీ విమానంలో రెండు వందల మంది వంతున ప్రయాణికులు ఇండియాకు గత రెండు రోజుల్లో చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27న మూడు విమానాలు కీవ్ నుంచి న్యూఢిల్లి రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమాన సర్వీసులు రద్దయినట్టే లెక్క.
తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని..
స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కీవ్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వారిని ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలంటూ భారత ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కొంత మేరకు సేఫ్‌గా ఉన్న పశ్చిమ ప్రాంతాల వారిని తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
ఎంబసీ వద్ద భారతీయుల పడి గాపులు...
రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్మీ విమానాలను..
ఉద్రిక్తలు మొదలవగానే ఇండియా వచ్చేందుకు మా తమ్ముడు ప్రయత్నించాడని కానీ విమాన ఛార్జీలు లక్షల్లో వసూలు చేస్తుండటంతో అక్కడే ఉండి పోయాడని డాక్టర్ పూజా అన్నారు. ప్రస్తుతం పౌర విమానాలకు రాకపోకలు నిషేధించిన నేపథ్యంలో మిలిటరీ విమానాలు పంపి భారతీయులను తీసుకురావాలని డిమాండ్ చేశారు.