AI & Chat GPT: సరికొత్త సాంకేతిక సవాలు.. రాతపూర్వక సమాచారాన్ని వీడియోగా మార్చనున్న ‘సోరా’!!
కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఒకడుగు ముందుకేసి, విప్లవాత్మకమైన ఛాట్‌బాట్ ‘ఛాట్ జీపీటీ’ని సృష్టించిన ‘ఓపెన్ ఏఐ’ సంస్థ ఇటీవల మరో ముందంజ వేసింది. సరికొత్త జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్‌ఏఐ) మోడల్‌ను ఆవి ష్కరించింది. రాతపూర్వక సమాచారాన్ని వీడియోగా మార్చే ‘సోరా’ అనే ఈ మోడల్ ఆసక్తి రేపుతోంది. సోరా అంటే జపనీస్‌లో ఆకాశమని అర్థం. సృజనకు ఆకాశమే హద్దంటూ ఏఐ వినియోగంతో చేసిన ఈ కొత్త ప్రయోగం ఏ మంచికి, ఎంత చెడుకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది.
యూజర్ ఇచ్చిన సమాచారానికి కట్టుబడి ఉంటూ, నాణ్యతలో రాజీ లేకుండా గరిష్ఠంగా ఒక నిమిషం నిడివి వీడియోలను సృష్టించడం ‘సోరా’ ప్రత్యేకత. కోరినట్టుగా జెన్‌ఏఐ వేదికలు బొమ్మల్ని సృష్టించడం, సమాచార ప్రతిస్పందనలు అందించడమనేది కొన్నేళ్ళుగా జరుగుతున్నదే, అంతకంతకూ మెరుగవుతున్నదే. టెక్స్›్ట నుంచి బొమ్మలను ఇప్పటికే సృష్టిస్తున్నప్పటికీ వీడియో తయారీ సంక్లిష్టమైనది. అందుకే, ఆ పని వెనుకబడింది. తీరా ఇప్పుడు ఓపెన్‌ఏఐ ప్రయోగాత్మకంగా ‘సోరా’ను ముందుకు తెచ్చింది. దాని పని తీరుకు ఉదాహరణగా మంచు కురుస్తున్న టోక్యో నగర వీధుల దృశ్యాల్ని సృష్టించింది. వాస్తవికమని భ్రమింపజేస్తున్న ఆ వీడియోను చూసి అబ్బురపడనివారు లేరు.
నిజానికి, టెక్ట్స్ నుంచి వీడియో సృష్టి అనే సాంకేతిక ప్రయోగం బరిలోకి ఇప్పటికే కొన్ని ఇతర సంస్థలూ ప్రవేశించాయి. గూగుల్, మేటా, అంకురసంస్థ రన్‌వే ఎంఎల్ లాంటివి ఈ సాంకేతికతను ఇప్పటికే చూపాయి. గూగుల్ ‘లూమియర్’ గత నెలలో విడుదలైంది. సమాచారం, లేదంటే ఛాయా చిత్రాల ఆధారంగా 5 సెకన్ల నిడివి వీడియోను సృష్టించడాన్ని ‘లూమియర్’ చేసి చూపింది.
Artificial Intelligence: పురోగతిలో భారత్.. వారికే ఉద్యోగావకాశాలు
అలాగే, రన్‌వే, పికా లాంటి ఇతర సంస్థలు సైతం తమవైన వీడియో సృష్టి మోడల్స్‌ను ముందుకు తెచ్చాయి. నిమిషం నిడివి గల వీడియోలు సృష్టించే ‘సోరా’ విషయానికొస్తే, సంక్లిష్ట సన్నివేశాలు, పలు రకాల పాత్రలు, ప్రత్యేక తరహా కదలికలు, కచ్చితమైన నేపథ్యంతో కూడిన దృశ్యాలు ఈ ‘సోరా’తో సాధ్యమట. వస్తువులనూ, మనుషులనూ అచ్చంగా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే చూపుతుందట.
అయితే, ఈ మోడల్ ఇంకా నిర్దుష్టంగా తయారుకాలేదనీ, సంక్లిష్ట సమాచారమిస్తే గందరగోళ పడవచ్చనీ దాన్ని రూపొందించిన ఓపెన్‌ఏఐ సైతం ఒప్పుకుంటోంది. అలాగే, కుడి, ఎడమల విషయంలో కాస్తంత తడబాటుకు గురికావడం లాంటి బలహీనతలూ ‘సోరా’లో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పుడు, విద్వేషపూరిత సమాచారాలకు వేదిక కాకుండా ఉండేలా... భద్రతా నిపుణులతో, విధాన నిర్ణేతలతో ఓపెన్‌ఏఐ చర్చించనుంది. అందుకే, ప్రస్తుతానికి ‘సోరా’ను సామా న్యులకు అందుబాటులో ఉంచలేదు. విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్లు, సినీ రూపకర్తలకు మాత్రం దీన్ని వాడుకొనే వీలు కల్పించింది. సృజనశీలురకు మరింత ఉపయోగపడేలా చేయాల్సిన మార్పులు చేర్పులపై వారి స్పందన తీసుకోనుంది.
మొత్తానికి, ఏఐతో ప్రపంచం మారిపోతోంది. గత రెండు దశాబ్దాల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో అపరిమిత డేటా సేకరణ, సమాచార విప్లవం వచ్చింది. ఇటీవలి జెన్‌ఏఐ పుణ్యమా అని ఆ భారీ డేటాను ఆసరాగా చేసుకొని, కీలక నిర్ణయాలు తీసుకొనేలా ఏఐ వ్యవస్థలు, అప్లికేషన్ల అభివృద్ధి జరిగింది. దాదాపు 30 వేల కోట్ల పదాలను వాడుకొని ఛాట్‌జీపీటీ సిద్ధమైంది. సుమారు 580 కోట్ల చిత్రాలు – రాతపూర్వక సమాచారం ఆధారంగా ఏఐ ఆధారిత ఇమేజ్–జనరేటింగ్ అప్లికేషన్లు డాల్–ఇ, మిడ్‌జర్నీ లాంటివి శిక్షణ పొందాయి.
ఏఐ వినియోగం పలు రంగాల్లో ఉపయుక్తమైనా, దాని వల్ల సమాజానికి సవాళ్ళూ అధికమే. సృజనశీలుర కృషిని అనుమతి లేకుండానే ఏఐ మోడల్స్ శిక్షణకు వాడుకోవడంపై పెద్ద కంపెనీలపై పలువురు కేసులేశారు. ఏఐని సర్వసిద్ధం చేయడానికి ఇప్పుడున్న డేటా సరిపోక, కొరత వస్తుందనీ అంచనా. ట్విట్టర్‌ను కొన్న ఎలాన్ మస్క్ నుంచి ప్రసిద్ధ రచయిత యువల్ నోవా హరారీ దాకా పలువురు ‘భారీ ఏఐ ప్రయోగాలకు విరామం ఇవ్వా’లంటూ నిరుడు బహిరంగ లేఖ రాయడం గమనార్హం.
చదవండి: AI & Chat GPT: ఫ్యూచర్ కెరీర్.. ప్రాంప్ట్ ఇంజనీర్!
అమెరికా నుంచి ఇండియా దాకా ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఏఐ సృష్టి వీడియోలతో మోస పుచ్చే ప్రమాదం ఉంది. తప్పుడు ప్రచారంతో నైతిక, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రంగంలో ఏఐతో చిక్కులు రాక మానవు. అయినా ఇప్పటికీ ఏఐ పర్యవేక్షణ టెక్ సంస్థల చేతిలోనే నడు స్తోంది. ప్రభుత్వాలింకా నిద్ర మేల్కోలేదు. యూరోపియన్ యూనియన్ మాత్రం డిసెంబర్‌లో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా సమగ్రమైన ఏఐ నిబంధనలవి. అయితే, తుది ఆమోదం పొందిన రెండేళ్ళ తర్వాత కానీ చట్టం అమలులోకి రాదు. ఇక, ఏఐ దుర్వినియోగంపై రచ్చతో ఓపెన్‌ఏఐ, మరో 19 టెక్ సంస్థలు ఎన్నికల డీప్‌ఫేక్‌ల నిరోధానికి కృషి చేస్తామన్నాయి.
పైకి ఏమంటున్నా, సోరా లాంటి ఏఐ టూల్స్ శిక్షణకు ఎక్కడ నుంచి, ఎంత వీడియోలు వాడుకున్న సంగతి కూడా ఓపెన్‌ఏఐ లాంటి సంస్థలు బయటపెట్టడం లేదు. ఛాట్‌జీపీటీ లాంటి జెన్‌ఏఐ టూల్స్ శిక్షణకై తమ కాపీరైట్ ఉల్లంఘించారంటూ ఇప్పటికే పలువురు రచయితలే కాదు, సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ సైతం ఓపెన్‌ఏఐ, దాని వ్యాపార భాగస్వామి మైక్రోసాఫ్ట్‌పై కేసులు పెట్టాల్సి వచ్చింది.
అమెరికన్ సంపన్నులు, వారి వెంట చైనీయులు ఇప్పటికే ఏఐ రేసులోకి దిగారు. ప్రస్తుతానికి భారతీయులం వెనుకబడివున్నా, అనివార్యమవుతున్న ఈ మార్పును అందిపుచ్చుకోక తప్పదు. ఏఐ ఓ సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారి తీస్తుందని నిపుణుల అభిప్రాయం. అందుకే, కేవలం ఏఐ వినియోగదారులుగా మిగిలిపోకుండా, ఏఐ ఆవిష్కర్తలం కావాలన్నది వారి సూచన.