Jobs in Courts: కోర్టుల్లో ఉద్యోగాల పేరిట రూ.13 కోట్ల మోసం
కొరుక్కుపేట: కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.13 కోట్లు మోసం చేసిన విషయం కలకలం రేపింది. విరుదునగర్‌లోని వేలుచ్చసామి నగర్‌కు చెందిన కృష్ణసామి (55) మల్లంగినరు ప్రభుత్వాసుపత్రిలో లెప్రసీ యూనిట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శశి బాలవనంతం గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె బాలమీనలోచన ఇటంకుడి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్. ఈ క్రమంలో కృష్ణసామి కుటుంబం, అతని స్నేహితుడు తిరుపూర్‌కు చెందిన లాయర్ నాగేంద్రకుమార్ కలిసి కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరి వద్ద నుంచి రూ.6.50 లక్షల నుంచి రూ.9 లక్షలు వరకు, అదే విధంగా 130 మంది నుంచి మొత్తం రూ.13 కోట్ల వరకు వసూలు చేశారు. వారికి నకిలీ నియామక పత్రాలు అందజేశారు. వారు విధులకు వెళ్లగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ నకిలీదని తేలింది. ఈ విషయమై బాధితులు కలెక్టర్, ఎస్పీ, క్రైం బ్రాంచ్‌లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఈ కేసుపై అర్ధరాత్రి జనం కృష్ణసామి ఇంటిని ముట్టడించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.