Education Sector: స్వర్ణయుగాన్ని తలపిస్తున్న విద్యా రంగం
ఆకివీడు: ప్రస్తుత విద్యా రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తుందని ఏపీ స్కూల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. మండలంలోని పెదకాపవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతులు, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులు, ల్రైబరీ, డిజిటల్ లైబ్రరీ, జిమ్ తదితర వాటితో పాటు క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రుల సమావేశం జరిగింది. సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలలో నాడు–నేడు పథకం ద్వారా మౌలిక వసతులు కల్పించి, రూ.18 వేల కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. బాధ్యతతో పనులు జరుగుతాయనే టెండర్ విధానానికి స్వస్తి చెప్పి.. పాఠశాలల పరిధిలో పనులు చేయించేలా నిధులు కేటాయిస్తున్నామన్నారు.
మన సొమ్ముతో చేస్తున్న పనుల పట్ల మన పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన వసతులన్నీ సమకూర్చుతుందని చెప్పారు. ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇవన్నీ ఒకటైతే విద్యార్థుల చదువు పట్ల తల్లిదండ్రుల శ్రద్ధ అవసరమని భాస్కర్ చెప్పారు. ఓఎస్‌డీ కఠారి వెంకట కృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలో తల్లిదండ్రులు వారి చదువును పట్టించుకుంటే, వారు ఉన్నతులైన తరువాత తల్లిదండ్రుల్ని పట్టించుకుంటారని చెప్పారు. ప్రాథమిక దశలోనే విద్యార్థులు చదువులో బలమైన పునాదులు వేయాలన్నారు. ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్‌ను వదిలివేయకూడదన్నారు. జెడ్పీటీసీ వేగేశ్న వెంకట్రాజు(యండగండి శ్రీను) మాట్లాడుతూ విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్వీ రమణ, సర్వశిక్షాఅభియన్ ఏపీసీ శ్యామ్‌సుందర్, ఎంపీపీ కఠారి జయలక్ష్మీ, సర్పంచ్ ఊసల బేబీ స్నేతు, హైస్కూల్ హెచ్‌ఎం శ్రీకాళహస్తేశ్వరరావు, ఉప సర్పంచ్ పాతపాటి పద్మావతి, కఠారి రామకృష్ణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.