Tribal University: గిరిజన వర్సిటీని సందర్శించిన చాన్స్‌లర్
విజయనగరం అర్బన్: విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన చాన్స్‌లర్ మదన్‌లాల్ మీనా (విశ్రాంతి ఐఏఎస్) శుక్రవారం సందర్శించారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టిమణి ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలిగారు. తొలుత వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వివిధ విభాగాలు, ప్రయోగశాలలను సందర్శించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ విశ్వవిద్యాలయ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాన్స్‌లర్‌కు వివరించారు. బోధన సిబ్బందితో మీనా మాట్లాడారు. బోధన, పరిశోధన, పరిపాలనా పరమైన వివిధ అంశాలపై పలుసూచనలు చేశారు. వర్సిటీలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, ప్రొఫెసర్ జితేంద్రమోహన్‌మిశ్ర, కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్స్ ప్రొఫెసర్ కివాడే, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.