Technical Education: సాంకేతిక విద్యతో బంగారు భవిత
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. మార్చి 18వతేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫిబ్రవరి నెలలోనే పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతక నిపుణులు సూచిస్తున్నారు.
గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం
గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలిసెట్–2024 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 5వ తేదీ పాలిటెక్నిక్ కోర్సులకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుకు తుది గడువు.
కోర్సుల వివరాలు:
- పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటో మొబైల్ ఇంజినీరింగ్, అర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మదనపల్లె (జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ), రాయచోటి, రాజంపేట, కలికిరి, ఓబులవారిపల్లెలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నడుస్తున్నాయి. దీంతో పాటు మదనపల్లె సమీపంలోని గోల్డన్‌వ్యాలీ ఇంజినీరింగ్ కాలేజీ, పీలేరులోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్‌లో క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు.
- పాలిసెట్ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది మే 10న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ,బీసీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు కట్టాలి.
- ఎన్నో ప్రయోజనాలు: పాలిటెక్నిక్‌లో కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సుచేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు ఖర్చువుతుంది. తర్వాత ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.
పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి తోడ్పడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–ఓబులేసు, ప్రిన్సిపాల్, జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, మదనపల్లె