Andhra Pradesh : టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్.. నిబంధనలు ఇవే..
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ డిసెంబర్ 10వ తేదీన (శనివారం) ఈ మేరకు జీఓ–187ను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ దశల అనంతరం 2023 జనవరి 12న టీచర్లకు బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి. 2021–2022 విద్యా సంవత్సరం నాటికి ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసును పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2) ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అలాగే విధివిధానాల్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే..
నిబంధనలు ఇవే..
☛ 2024 ఆగస్టు 31 లేదా అంతకు రెండేళ్లలోపు పదవీ విరమణ చేయబోయే వారిని వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు.
☛ బదిలీ దరఖాస్తుకు ఎలాంటి సర్వీసు నిబంధన లేదు.
☛ 2022 ఆగస్టు 31 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న బాలికల హైస్కూల్లోని పురుష హెచ్‌ఎం టీచర్లకు బదిలీ తప్పనిసరి.
☛ బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2), ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే 50 ఏళ్లు దాటిన పురుష హెచ్‌ఎంలు, టీచర్లను పరిగణనలోకి తీసుకుంటారు.
☛ విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
☛ దృష్టిలోపం ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ టీచర్లకు కూడా బదిలీల నుండి మినహాయింపు ఉంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులు బదిలీని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ పేరెంట్ మేనేజ్‌మెంట్‌కి వెళ్లాలని కోరుకునే వారు ఆ మేనేజ్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీని ఎంచుకోవాలి.
☛ ఏజెన్సీ మైదాన ప్రాంతాల వారికి బదిలీ అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీకాకపోతే ఇతర ప్రాంతంలోని జూనియర్ మోస్ట్ మిగులు టీచర్లను బదిలీ కౌన్సెలింగ్ తర్వాత తాత్కాలికంగా నియమిస్తారు.
ఆన్‌లైన్‌లో..
బదిలీలు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయి. గతంలో ఉన్న పాత జిల్లాలను జిల్లాగా పరిగణించాలి. ప్రతి జిల్లా, జోన్‌లో ఏర్పాటుచేసిన కమిటీల ఆమోదంతో విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు జారీచేస్తుంది. హెచ్‌ఎం, టీచర్ల వెబ్‌అప్షన్ల ఆధారంగా బదిలీ పోస్టింగ్ ఆర్డర్లను జారీచేస్తారు. బదిలీల కోసం పాయింట్లను గణించేందుకు కమిటీ నివాసాల జాబితాను కొత్తగా ప్రకటిస్తుంది. మెరిట్, సర్వీసు, ప్రత్యేక పాయింట్ల కేటాయింపు, మినహాయింపు వంటి అంశాలను జీఓలో వివరంగా పొందుపరిచారు. అంతేకాక.. 2022 నవంబర్ 30 నాటికి అన్ని ఖాళీలను కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు.
నిర్బంధ బదిలీల కారణంగా ఏర్పడే అన్ని ఖాళీలు, కౌన్సెలింగ్ సమయంలో అయ్యే ఖాళీల్లోకి బదిలీలు ఉంటాయి. అడహక్ ప్రాతిపదికన పదోన్నతిపై కేటాయించిన హెచ్‌ఎంలు, టీచర్ల స్థానాలు ఖాళీగా చూపిస్తారు. ఏడాదికి పైగా అధికారికంగా లేదా అనధికారికంగా రాని వారి స్థానాలు ఖాళీలుగా పరిగణిస్తారు. ప్రసూతి సెలవులు, వైద్య సెలవులు లేదా సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను కౌన్సెలింగ్‌లో చూపించరు. నాలుగు వారాలకు మించి ఖాళీగా ఉంటే పని సర్దుబాటు ద్వారా వాటిని భర్తీచేయాలి. పూర్వపు జిల్లాల్లో మంజూరు పోస్టుల్లో భర్తీ అయినవి కాకుండా మిగిలిన పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఖాళీలు, సీనియారిటీ జాబితాలను కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో సంబంధిత జిల్లాల వెబ్‌సైట్‌లో కూడా పొందుపరుస్తారు.
వెబ్ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఇలా..
➤ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్‌సైట్ ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అందిన దరఖాస్తులను మాత్రమే బదిలీకి పరిగణిస్తారు.
➤ ఆన్‌లైన్ సమర్పించాక దరఖాస్తుదారులు నిర్దిష్ట వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ప్రింట్‌ను తీసుకోవాలి.
➤ వాటిపై సంతకంచేసి మండల విద్యాధికారి, హైస్కూల్ హెడ్‌మాస్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌లకు అందజేయాలి.
➤ దరఖాస్తుల స్వీకరణ తర్వాత, సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రదర్శించాలి.
➤ అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాలి. అవి పరిష్కరించిన తర్వాత, అధికార వెబ్‌సైట్‌లో తుది సీనియారిటీని ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్‌లతో చూపించాలి.
➤ తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు అన్ని అప్షన్లను ఎంచుకోవాలి. ఇలాంటి హెచ్‌ఎం, టీచర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోతే 3, 4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఉన్న ఖాళీలకు బదిలీచేస్తారు.
➤ దరఖాస్తు చేసి ఆపై వారికి సమర్పించకపోతే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో రూపొందించిన తుది జాబితాల ఆధారంగా సంబంధిత కమిటీల ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి.
ఇలా చేస్తే కఠిన చర్యలు..
ఇక కమిటీ ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, కమిటీ కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్లను సమీక్షించడం, సవరించడానికి వీల్లేదు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి ఉత్తర్వుల్లో షరతును చేర్చాలి. బదిలీ ఆర్డర్లు అందిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే రిలీవ్ అవుతారు. తదుపరి తేదీన వారు కొత్త పాఠశాల్లో చేరాలి. పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు (సబ్జెక్ట్ టీచర్లతో సహా) పనిచేస్తూ బదిలీని పొందినట్లయితే, ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరాదు. అలాగే, ఇతర స్థానాల విషయంలో కూడా ప్రత్యామ్నాయం తర్వాతే రిలీవ్ చేస్తారు. తప్పుడు సమాచారమిచ్చి, మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌తో పాటు క్రమశిక్షణా చర్యలు తప్పవు. తప్పుడు సమాచారంపై సంతకం చేసిన హెచ్‌ఎం ఇతర అధికారులపైనా ఇవే చర్యలు ఉంటాయి. బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ స్థానంలో చేరాలి. అనధికారికంగా గైర్హాజరైతే మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణా చర్యతో పాటు ‘నో వర్క్ నో పే’ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీల షెడ్యూల్ ఇలా..
➤ ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో ప్రదర్శన : డిసెంబర్ 12, 13
➤ బదిలీలకు దరఖాస్తు : డిసెంబర్ 14 నుంచి 17 వరకు
➤ దరఖాస్తుల వెరిఫికేషన్ : డిసెంబర్ 18, 19
➤ సీనియారిటీ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల అప్‌లోడ్ : డిసెంబర్ 20 నుంచి 22 వరకు
➤ అభ్యంతరాల పరిశీలన, ఫైనల్ చేయడం : డిసెంబర్ 23, 24
➤ ఫైనల్ సీనియారిటీ జాబితాల ప్రదర్శన : డిసెంబర్ 26
➤ వెబ్‌ఆప్షన్లు : డిసెంబర్ 27 నుండి జనవరి 1 వరకు
➤ బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు : జనవరి 2 నుంచి 10 వరకు
➤ కేటాయింపులో తేడాలుంటే అభ్యంతరాలు : జనవరి 11
➤ బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్ చేసుకోవడం : జనవరి 12