CM YS Jagan : విద్యారంగంలొ అత్యంత ప్రాధాన్యత వీటికే..
విద్యా రంగంలో మనబడి నాడు–నేడు, ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి కూడా పెద్దపీట వేయాలని స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై అక్టోబర్ 2వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ తదితర కార్యక్రమాలు, అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
‘నాడు–నేడు’ సమర్థవంతంగా సాగాలి..
విద్యారంగంలో నాడు–నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మనబడి నాడు–నేడు మొదటి విడతలో ఇప్పటివరకూ రూ.3,650 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడత కింద 12,663 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, ఆస్పత్రుల నాడు–నేడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సమీక్షిస్తూ.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.
2021–22లో విద్యా కానుకకు రూ.790 కోట్లు..
విద్యాకానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, బూట్లు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2021–22లో రూ.790 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే.. జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.